
వాషింగ్టన్: అమెరికాలో టెక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న లక్షలాది మందిని ఇటీవల కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఉన్న ఉద్యోగం కోల్పోయి.. కొత్త ఉద్యోగం దొరక్క వీరంతా తీవ్ర భయాందోళనలతో జీవిస్తున్నారు. ఈ సమయంలో హెచ్1బీ వీసాలకు సంబంధించి రూల్ వీరిని మరింత టెన్షన్ పెడుతోంది. జాబ్ కోల్పోయిన 60 రోజుల్లోగా వీరు కొత్త జాబ్‌లో చేరి.. కొత్త కంపెనీ నుంచి హెచ్1బీ వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. లేకుంటే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగాలు కోల్పోయిన చాలా మందికి సంబంధించి గ్రేస్ పిరియడ్ దగ్గర పడుతుండటంతో కొత్త జాబ్ దొరక్క వీరంతా నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి వారికి కాస్త రిలీఫ్ ఇచ్చేలా బైడెన్ ప్రభుత్వం హెచ్1బీ వీసాలకు సంబంధించి గ్రేస్ పీరియడ్‌ను పెంచాలని ఇండో అమెరికన్లు కోరుతున్నారు.
ప్రస్తుతం 60 రోజులుగా ఉన్న గ్రేస్ పీరియడ్‌ను 6 నెలలకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఆర్డర్ ఇస్తే హెచ్1బీ వీసా గడువు ముగిసిన తర్వాత 6 నెలల వరకు అమెరికాలోనే ఉండి వారు వేరే ఉద్యోగాన్ని వెతుక్కునేందుకు వీలు చిక్కుతుంది. అప్పటికీ కొత్త ఉద్యోగం దొరకనట్లయితే వారంతా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిందే. బైడెన్ ప్రభుత్వం ఆర్డర్‌ను రిలీజ్ చేస్తే వారికి కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి సమయం దొరుకుతుందని, వారికి కాస్త రిలీఫ్‌గా ఉంటుందని, ఇది చాలా చిన్న విషయమని, బైడెన్ కావాలనుకుంటే వెంటనే నిర్ణయం తీసుకోవచ్చని సిలికాన్ వ్యాలీలోని కార్నెగీ మెలన్ వర్సిటీ ప్రొఫెసర్ వివేక్ వాద్వా చెప్పారు. పోయిన ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ వంటి టాప్ టెక్ కంపెనీలు దాదాపు 2 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సమాచారం.