ఆందోళన వద్దు : అందుబాటులో బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్: రణదీప్ గులేరియా

ఆందోళన వద్దు : అందుబాటులో బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్: రణదీప్ గులేరియా

 ప్రపంచ వ్యాప్తంగా గత రెండు దశాబ్దాలకు పైగా బర్డ్ ఫ్లూ కలవర పెడుతున్న సంగతి తెలిసిందే.. H5N1 అని పిలువబడే ఇన్ఫ్లుఎంజా వైరస్ అత్యంత  ప్రమాదకరమైనది.  బర్డ్ ఫ్లూ అనేది  పౌల్ట్రీ, ఇతర పక్షులు, పాలిచ్చే జంతువులకు సోకుతుంది. అయితే ఈ జబ్బు ప్రస్తుతం మనుషులకూ సోకే ప్రమాదం కూడా ఉంది. 25 ఏండ్లుగా అడవుల్లోని పక్షులు, కోళ్లల్లో ఉన్న హెచ్‌‌‌‌5ఎన్‌‌‌‌1 వైరస్‌‌‌‌ మానవులను కూడా ప్రభావితంచేసే అవకాశం ఉందని గతంలో డబ్ల్యూహెచ్‌‌‌‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ప్రకటించారు. అందువల్ల మనుషులు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న జంతువులను తాకవద్దని సూచించారు.

అయితే బర్డ్ ఫ్లూ వైరస్ తో భయపడాల్సిన అవసరం లేదని  AIIMS మాజీ హెడ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. బర్డ్ ఫ్లూ  వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు.  బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బర్డ్ ఫ్లూ మనుషులకు విస్తరిస్తే  కొవిడ్ కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

బర్డ్ ఫ్లూ ప్రధానంగా ఏవియన్ జాతులు లేదా పక్షులను ప్రభావితం చేస్తుంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించినట్లు ఇంకా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ.. ఒకవేళ అదే నిజమైతే  మరణాలు 60 శాతానికి పెరగవచ్చు. అపుడు  కోవిడ్ మరణాల కంటే ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.