ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్తం: రేవంత్

ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్తం: రేవంత్
  • పీసీసీ చీఫ్ రేవంత్ ప్రకటన
  • కేంద్రం వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేస్తమని వెల్లడి
  • కాంగ్రెస్ చీఫ్ అధ్యక్షతన ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌‌‌‌లు, సీఎల్పీ నేతల భేటీ
  • రాష్ట్రం నుంచి హాజరైన రేవంత్, భట్టి

న్యూఢిల్లీ, వెలుగు: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా ‘హాత్ సే హాత్’ కార్యక్రమాన్ని రాష్ట్రంలో జనవరి 26 నుంచి ప్రారంభించనున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ దాకా ఈ ప్రోగ్రాం జరుగుతుందని చెప్పారు. శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక భేటీ జరిగింది. ఈ మీటింగ్‌‌‌‌లో పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్య నేతలు పవన్ కుమార్ బన్సాల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘెల్, వివిధ విభాగాల ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌లు, ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌‌‌‌లు, శాసనసభా పక్ష నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమంపై చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలను లేవనెత్తామని, చైనా చొరబాట్లు, జాతీయ భద్రత సహా 16 అంశాలపై 18 విపక్ష పార్టీలతో కలిసి కేంద్రాన్ని నిలదీశామని మల్లికార్జున ఖర్గే చెప్పారు. పార్లమెంట్ నడవకుండా కాంగ్రెస్ అడ్డుకుంటున్నదన్న బీజేపీ విమర్శలకు చెక్ పెట్టేలా ఈ సెషన్ సజావుగా సాగేందుకు సహకరించినట్లు వెల్లడించారు. కానీ జాతీయ భద్రత, ద్రవ్యోల్బణం-, నిరుద్యోగంపై చర్చకు అధికార పార్టీ దూరంగా పారిపోయిందని ఖర్గే విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్తం: రేవంత్

ఆయా రాష్ట్రాల్లోని సమస్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మీటింగ్‌‌‌‌లో చర్చించినట్లు రేవంత్ తెలిపారు. భేటీ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్‌‌‌‌షీట్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్తామని తెలిపారు. గ్రామ, జిల్లా, బ్లాక్ స్థాయి నుంచి ప్రజా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జనవరి 3, 4వ తేదీల్లో రాష్ట్రానికి చెందిన జిల్లా నాయకులతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాహుల్ యాత్రకు భయపడే బీజేపీ సర్కార్ కరోనా రూల్స్ తెస్తోందని విమర్శించారు. యాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను రాహుల్ గాంధీ.. పార్లమెంట్‌‌‌‌లో ప్రస్తావిస్తారనే సెషన్‌‌‌‌ను ముందుగా క్లోజ్ చేశారని చెప్పారు. శనివారం ఢిల్లీకి చేరుకోనున్న జోడో యాత్రలో తనతో పాటూ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొంటారన్నారు.