
హాజీపూర్‌లో ముగ్గురు బాలికల దారుణ హత్యకు కారణమైన సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్‍రెడ్డి నేర ప్రవృత్తి నాలుగేళ్ల కిందటే వెలుగులోకి వచ్చింది. అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే శ్రావణి, మనీషాల ప్రాణాలు దక్కేవని గ్రామస్థులు అంటున్నారు. మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన(11)ను శ్రీనివాస్‍రెడ్డి 2015 ఏప్రిల్ 23న అత్యాచారం చేసి చంపి తన పొలంలోని పాడుబడ్డ బావిలో పాతిపెట్టాడు. అప్పట్లో బాలిక ఆచూకీ కోసం వెతికిన తల్లిదండ్రులు భాగ్యమ్మ, నందం దంపతులు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మిస్సింగ్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కల్పన పేరెంట్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లరిగిలా తిరిగినా ఫలితం లేకపోయింది. అదే ఏడాది సెప్టెంబర్ 28న శ్రీనివాస్‍రెడ్డి తన వ్యవసాయ బావి సమీపంలో మైసిరెడ్డిపల్లికి చెందిన వివాహితపై అత్యాచారానికి యత్నించాడు. అయితే ఆమె కేకలు వేయడం, అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి రావడతో శ్రీనివాస్‍రెడ్డి ఆమెను వదిలేసి పారిపోయాడు. కొందరు వెంబడించి అతన్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి కొట్టారు.
పోలీసులు వచ్చి శ్రీనివాస్‍రెడ్డిని స్టేషన్‍కు తీసుకెళ్లి కేసు పెట్టారు. అప్పుడే కల్పన తల్లి భాగ్యమ్మ.. శ్రీనివాస్‍రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎస్సైని కలిసింది. అయితే ఎస్సై పట్టించుకోలేదు. రిమాండ్ చేసి అతడిని వదిలేశారే తప్ప లోతుగా ఎంక్వైరీ చేయలేదు. అప్పుడే దర్యాప్తు చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదని, శ్రావణి, మనీషాల ప్రాణాలు పోయేవి కావని హాజిపూర్, మైసిరెడ్డిపల్లి గ్రామస్థులంటున్నారు. పోలీసులు విడిచిపెట్టడంతో అతడు రెచ్చిపోయాడు. 2017లో కర్నూలులో ఓ యువతిని హత్య చేసి, ఇంటిపైనున్న నీటి సంపులో వేసి పరారయ్యాడు. కర్నూలు పోలీసులు ఇతడిని పట్టుకెళ్లి జైల్లో వేశారు. అప్పుడు కూడా పోలీసుల విచారణలో కల్పన హత్య విషయం బయటపడలేదు. తర్వాత జైల్ నుంచి బెయిల్‍పై బయటకొచ్చిన శ్రీనివాస్‍రెడ్డి శ్రావణి, మనీషాలను హత్య చేశాడు.
నలుగురేనా.. ఇంకా ఉన్నారా?
శ్రీనివాస్‍రెడ్డి బైక్‍పై జులాయిగా తిరుగుతూ బాలికలను ట్రాప్ చేసే పనిలోనే ఉండేవాడు. గ్రామంలో ఉన్నన్ని రోజులు రోడ్ల వెంట చెట్ల కింద బైక్ పెట్టి దారికాచేవాడు. ఇంకొన్ని రోజులు వేరే ప్రాంతాలకు వెళ్లేవాడు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు తరచుగా వెళ్లేవాడని పోలీసులు గుర్తించారు. ఇతడికి రెండు ఫేస్‍బుక్ అకౌంట్లున్నాయి. ఒకదాంట్లో 335మంది, మరోదాంట్లో 161మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలోనూ ఎక్కువ మంది మహిళలు, యువతుల ఫొటోలే ఉన్నాయి. వీటన్నింటిని చూస్తుంటే ఐదేళ్లలో ఇతడు నాలుగు హత్యలే చేశాడా? ఇంకెవరినైనా ఇలాగే చంపేశాడా అన్న అనుమానం కలుగుతోంది. అలాగే శ్రీనివాస్‍రెడ్డి పొలంలో రెండు పాడు బడ్డ బావులుండగా.. దీనికి సమీపంలోనే మరో పాడుబడ్డ బావి ఉంది. ఓ బావిలో శ్రావణి, మనీషా మృతదేహాలు దొరకగా.. మరో బావిలో కల్పన బాడీ లభ్యమైంది. ఈ రెండు బావులకు సమీపంలోనే మరో పాడుబడ్డ బావి ఉంది. అందులో కూడా తవ్వకాలు చేపట్టాలని గ్రామస్థులు అంటున్నారు.