మంచిర్యాలలో..బీఆర్ఎస్​కు షాక్

మంచిర్యాలలో..బీఆర్ఎస్​కు షాక్
  • కాంగ్రెస్​లో చేరిన హాజీపూర్​జడ్పీటీసీ శిల్ప దంపతులు 
  • మాజీ జడ్పీటీసీ ఆశాలత సహా ఇతర నేతలు కూడా..
  • ఎమ్మెల్యే దివాకర్​ రావు వైఖరి  నచ్చక కారు దిగిన లీడర్లు

మంచిర్యాల, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​ తగిలింది. మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్​లో చేరారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు అణిచివేస్తున్నాడంటూ కొందరు లీడర్లు సోమవారం బీఆర్ఎస్​కు రిజైన్​చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం రాజీనామా పత్రాలను మంచిర్యాల బైపాస్​రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఉంచి నివాళులర్పించారు. 

హజీపూర్ లోని అంబేద్కర్​ విగ్రహానికి అంజలి ఘటించారు. తర్వాత భారీ కాన్వాయ్ తో  హైదరాబాద్ బయల్దేరి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్​రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి వారికి కండువాలు కప్పి స్వాగతించారు. 

కాంగ్రెస్​లో చేరింది వీరే..

హాజీపూర్ జడ్పీటీసీ మెంబర్​పూస్కూరి శిల్ప, ఆమె భర్త, మండల రైతుబంధు కమిటీ అధ్యక్షుడు పూస్కూరి శ్రీనివాసరావు, మంచిర్యాల మాజీ జడ్పీటీసీ మెంబర్​రాచకొండ ఆశాలత, హాజీపూర్ మాజీ ఎంపీటీసీ బొడ్డు శైలజ, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు దొమ్మటి సత్తయ్య, వేంపల్లి మాజీ సర్పంచ్ గోనె సంజయ్, సీనియర్ అడ్వొకేట్, తెలంగాణ ఉద్యమకారుడు సిరిపురం శ్రీనివాస్, ఉప సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరపు జితేందర్ రావు, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్, బీఆర్ఎస్​పట్టణ మాజీ అధ్యక్షుడు సాగే సుమోహన్, సీనియర్ లీడర్లు బెల్లంకొండ మురళీధర్, సింగతి మురళి, చిలువేరు నాగేశ్వర్​రావుతో పాటు దాదాపు500 మంది కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, ఆయన కొడుకు విజిత్​రావు ఒంటెత్తు పోకడలతో విసిగిపోయి బీఆర్ఎస్​కు రాజీనామా చేసినట్లు తెలిపారు.