పాక్​కు మన దేశ యుద్ధవిమానాల సీక్రెట్స్ అమ్మిండు

పాక్​కు మన దేశ యుద్ధవిమానాల సీక్రెట్స్ అమ్మిండు
  • ఫైటర్ జెట్, తయారీ యూనిట్ సమాచారం ఐఎస్ఐకి చేరవేత 
  • నాసిక్ లో హెచ్ఏఎల్ ఉద్యోగి అరెస్టు

ముంబై: పాకిస్తాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీకి మన దేశ యుద్ధ విమానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను అందజేస్తున్నాడనే ఆరోపణలతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అతడిని దీపక్ షిర్సాత్(41)గా గుర్తించారు. దీపక్ గురించి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అందడంతో నాసిక్​లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) యూనిట్ పోలీసులు శుక్రవారం అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరి నుంచి 3 మొబైల్స్,  5 సిమ్ కార్డులు, రెండు మెమోరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, 10 రోజుల ఏటీఎస్ కస్టడీకి అప్పగించింది. దీపక్ మన యుద్ధ విమానంతో పాటు దాని తయారీ యూనిట్ వివరాలను ఐఎస్ఐకి చేరవేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సెన్సిటివ్ డిటెయిల్స్, సీక్రెట్స్ తో పాటు నాసిక్ సమీపంలోని ఓఝార్ లో ఉన్న హెచ్ఏఎల్ మాన్యూ ఫాక్చరింగ్ యూనిట్, ఎయిర్ బేస్, అందులోని ప్రొహిబిటెడ్ ఏరియాల ఇన్ఫర్మేషన్​ను ఐఎస్ఐకి అందజేస్తున్నాడని పేర్కొన్నారు. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద దీపక్ పై కేసు నమోదు చేశామని చెప్పారు. మిగ్ 21ఎఫ్ఎల్, కే–13 మిస్సైళ్ల తయారీ కోసం హెచ్ఏఎల్ ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్ (నాసిక్)ను 1964లో ఏర్పాటు చేశారు. ఇది నాసిక్ కు 24 కిలోమీటర్ల దూరంలోని ఓఝార్ లో ఉంది. ఇక్కడ మిగ్ 21ఎఫ్ఎల్, మిగ్ 21ఎం, మిగ్ 21 బీఐఎస్, మిగ్ 27 ఎం, సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లను కూడా తయారు
చేస్తున్నారు.