ఆల్మట్టి సగం నిండింది

ఆల్మట్టి సగం నిండింది

67 టీఎంసీలు దాటిన నిల్వ
ప్రాజెక్టులోకి 11,997 క్యూసెక్కుల నీళ్లు
తుంగభద్రలోకి మోస్తరుగా వరద
మన ప్రాజెక్టుల్లోకి కొద్దిపాటి ప్రవాహాలు

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ మొదలైన నెల రోజుల్లోపే కర్నాటకలోని ఆల్మట్టి డ్యాం సగానికి పైగా నిండింది. ఆల్మట్టి నిర్మాణం తర్వాత ప్రాజెక్టులోకి సగానికి పైగా నీళ్లు ఇంత త్వరగా రావడం ఇదే మొదటిసారి అని ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. డ్యాం మొత్తం నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ఆదివారం ఉదయం 6 గంటల వరకు 67.45 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టులోకి 11,997 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మూడు రోజులుగా 20 వేల క్యూసెక్కుల నుంచి 45 వేల క్యూసెక్కులకు వరకు నీళ్లు వచ్చాయి. గతేడాది ఇదే రోజు ప్రాజెక్టులో 21.78 టీఎంసీల నీళ్లుమాత్రమే ఉన్నాయి. జూన్ ఒకటి నుంచి కొత్తగా 41.30 టీఎంసీల నీళ్లు ఆల్మట్టిలోకి కొత్తగా వచ్చాయి. తుంగభద్ర డ్యాంలోకి ఓ మోస్తరు వరద వస్తుండగా.. మన కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు కొద్దిపాటి ప్రవాహాలు వస్తున్నాయి.

మరో 62 టీఎంసీలు
ఆల్మట్టిలోకి ఇంకో 62 టీఎంసీల నీళ్లు చేరితే డ్యాం పూర్తిగా నిండుతుంది. కర్నాటకలో భారీ వర్షాలు కురిస్తే జూలై రెండో వారంలోనే ఈ ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేసే అవకాశముంది. ఇక ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్లో 37.64 టీఎంసీలకు గాను 23.85 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులోకి 947 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మన రాష్ట్రంలో కృష్ణా బేసిన్ లో మొదటి ప్రాజెక్టు అయిన జూరాలకు ఇంకా వరద రాలేదు.

గోదావరి బేసిన్ లో ఇలా..
గోదావరి బేసిన్ లో ఎస్సారెస్పీకి ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన జైక్వాడి ప్రాజెక్టులోనూ సగానికి పైగా నీళ్లున్నాయి. ఈ ఫ్లడ్ సీజన్ లో కొత్తగా 3.32 టీఎంసీల నీళ్లు మాత్రమే చేరినా.. 102.73 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ ప్రాజెక్టులో ఆదివారం నాటికి 55.07 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే రోజు జైక్వాడిలో కేవలం 19.19 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎస్సారెస్పీలోకి ఇప్పటి వరకు చుక్క నీరు వచ్చి చేరలేదు. మిడ్ మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 29.72 టీఎంసీల నీళ్లునిల్వఉండగా, గతేడాది ఇదే రోజు 5.51 టీఎంసీలే ఉన్నాయి.

మేడిగడ్డ బ్యారేజీకి 11,700 క్యూసెక్కుల ఇన్ఫ్లో
మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత వరద వచ్చి చేరుతోంది. పది రోజులుగా ఓ మోస్తరు ప్రవాహాలు ప్రాణహితలో నమోదవుతున్నాయి. ఆదివారం 11,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. బ్యారేజీలో 4.44 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. దిగువ గోదావరిలో మోస్తరుకు మించి ప్రవాహాలు రికార్డవుతున్నాయి. శబరి నది నుంచి వస్తున్న నీటిని ఏపీ ప్రభుత్వం గోదావరి డెల్టాకు ఇస్తూనే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గత 28 రోజుల్లో 17.51 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి.

For More News..

హైదరాబాద్లో.. మళ్లీ లాక్డౌన్! అన్నీ సిద్ధం చేయాలని సీఎం సూచన

ఆన్ లైన్ క్లాసులపై నో క్లారిటీ.. అయినా ఆపమంటున్న ప్రైవేట్ సంస్థలు

డాడీ.. ఊపిరి ఆడుతలేదు.. ఆక్సిజన్‌‌ తీసేసిన్రు.. ఇక సచ్చిపోతున్న బై..