సగం వాటా ఇవ్వాల్సిందే..కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ సర్కార్

సగం వాటా ఇవ్వాల్సిందే..కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్, వెలుగు:  గోదావరి, కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టులో తెలంగాణ వాటాగా సగం నీటిని ఇవ్వాల్సిందేనని రాష్ట్ర సర్కార్ తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 148 టీఎంసీల జలాలు అందుబాటులోకి వస్తాయని, గోదావరి పరిధి దృష్ట్యా రాష్ట్రానికి అందులో 74 టీఎంసీల నీళ్లను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ)కి రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. అనుసంధానం ద్వారా అందుబాటులోకి వచ్చే 148 టీఎంసీలలో సగం వాటా ఇవ్వాలని ముందు నుంచీ కోరుతున్నామని, కానీ, నిరుడు నవంబర్‌ 10న నిర్వహించిన ఐదో కన్సల్టెన్సీ మీటింగ్‌లో 45.06 టీఎంసీల నీళ్లనే కేటాయించారని, మా రిక్వెస్ట్‌ను పట్టించుకోకుండా ఆ తర్వాతి నెలలో (2023 డిసెంబర్) ఇచ్చిన డీపీఆర్‌లో మాత్రం 41.21 టీఎంసీలకు కుదించారని ఆక్షేపించారు. 

సమ్మక్కసాగర్‌ను ఎండబెడ్తరా..

గోదావరి, కావేరి నదుల అనుసంధానంలో భాగంగా సమ్మక్కసాగర్ బ్యారేజీ ఎగువన 15.88 టీఎంసీల సామర్థ్యంతో 87 మీటర్ల ఎత్తుతో ఇచ్చంపల్లి బ్యారేజీని తలపెట్టారని, అయితే, దానిని సమ్మక్క బ్యారేజీకి వరద వచ్చే అప్‌స్ట్రీమ్‌లో కట్టడం వల్ల సమ్మక్క బ్యారేజీకి వచ్చే సగం వరద తగ్గిపోతుందని రాష్ట్ర సర్కార్ పేర్కొన్నది. ఫుల్ లెవెల్‌లో ఇచ్చంపల్లిలో నీళ్లను నిల్వ చేస్తే మేడిగడ్డ బ్యారేజీ ఆపరేషన్లపైనా ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. 

కర్ణాటకకు నీళ్లెందుకు?

అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా కర్నాటకకు తాగు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలను కేటాయించారని, ఆ రాష్ట్రానికి వాటా వద్దని లేఖలో తెలంగాణ సర్కారు కోరింది. కర్నాటకకు నీళ్లిస్తే జూరాలకు నష్టం జరుగుతుందని అభ్యంతరం తెలిపింది. తెలంగాణకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుసంధాన ప్రాజెక్ట్‌లో నీళ్ల వాటా సగం (74 టీఎంసీలు) కావాల్సిందేనని తేల్చి చెప్పింది. కర్నాటకలో బేడ్తి-వరదా ఇంట్రాలింక్ ప్రాజెక్టులో 9 టీఎంసీల నీళ్లను కేటాయించాలని డిమాండ్ చేసింది. 

పరిహారం మాటేమిటి?

నదుల అనుసంధానంతో రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న సాగు భూములు నష్టపోతాయని సర్కార్ లేఖలో పేర్కొన్నది. మొత్తంగా 5,984 ఎకరాలు‌ ముంపునకు గురవ్వాల్సిన పరిస్థితి ఉందని తెలిపింది. ఆ ల్యాండ్‌ను సేకరించాలంటే ప్రస్తుత పునరావాసం, పరిహార చట్టం ప్రకారమే చేయాలని తేల్చి చెప్పింది‌‌. నదుల లింకింగ్‌కు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లా ఉంటుందని, అయితే ఈ ప్రాజెక్ట్ ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ అయినందువల్ల భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, సాగర్ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా సిమ్యులేషన్ స్టడీలు చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏని కోరింది.