
గాజా/జెరూసలెం: ఇజ్రాయెల్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా 25 మంది బందీలను హమాస్ మిలిటెంట్లు విడుదల చేశారు. ఇందులో 13 మంది ఇజ్రాయెల్, 12 మంది థాయ్‌లాండ్ పౌరులు ఉన్నారని ఇజ్రాయెల్ పేర్కొంది. కాగా, ఏడు వారాలుగా తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన గాజా స్ట్రిప్ లో కాల్పులు బంద్ అయ్యాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. ఒప్పందానికి కట్టుబడి ఇరుపక్షాలూ కాల్పులు ఆపేశాయి. దీంతో నెలన్నర రోజులుగా యుద్ధంతో చస్తూ బతికిన పాలస్తీనియన్ లకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.
ఖతర్, యూఎస్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ ఈ ఒప్పందానికి అంగీకరించాయి. శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు గాజా స్ట్రిప్ లో కాల్పులు ఆపేసేందుకు ఇరుపక్షాలు ఒప్పుకున్నాయి. ఈ నాలుగు రోజుల్లో ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనియన్ ఖైదీలను రిలీజ్ చేయనుంది. అదనంగా విడుదల చేసే ప్రతి 10 మంది బందీలకు ఒకరోజు చొప్పున కాల్పుల విరమణను పొడిగిస్తామని కూడా ప్రకటించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం ముగియగానే మళ్లీ హమాస్ పై దాడులు ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
గాజాలోకి 200 ట్రక్కులు ప్రవేశం..
ఒప్పందంలో భాగంగా గాజా స్ట్రిప్ లోకి ఈజిప్ట్ బార్డర్ గుండా ఫ్యూయెల్, గ్యాస్ ట్యాంకులు, నిత్యావసర సరుకుల ట్రక్కులను ఇజ్రాయెల్ అనుమతించింది.