5 రోజులు కాల్పులు ఆపితే.. 70 మందిని విడిచిపెడ్తం

5 రోజులు కాల్పులు ఆపితే.. 70 మందిని విడిచిపెడ్తం

గాజా/జెరూసలెం : ఇజ్రాయెల్ బలగాలు ఐదు రోజుల పాటు కాల్పుల విరమణ పాటిస్తే తమ వద్ద ఉన్న బందీల్లో 70 మంది మహిళలు, పిల్లలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటించింది. ఖతర్ మధ్యవర్తిత్వంతో తాము ఈ  ఒప్పందానికి ముందుకు వచ్చినట్లు హమాస్ అధికార ప్రతినిధి అబూ ఉబైదా సోమవారం టెలిగ్రామ్ చానెల్ ద్వారా వెల్లడించారు. పూర్తిస్థాయి కాల్పుల విరమణతోపాటు గాజా అంతటా పాలస్తీనియన్లకు మానవతా సాయం అందిస్తేనే ఈ ఒప్పందానికి కట్టుబడి బందీలను విడిచిపెడతామన్నారు. కాగా, నార్త్ గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.

గాజా సిటీలోని అతిపెద్దదైన అల్ షిఫా ఆస్పత్రి కరెంట్, నీళ్లు, తిండి, మందులు లేక సోమవారం నుంచి మూతపడింది. ప్రస్తుతం నార్త్ గాజాలో ఒకే ఒక్క ఆస్పత్రి పనిచేసే స్థితిలో ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘ఓచా’ వెల్లడించింది. మరోవైపు అల్ షిఫా ఆస్పత్రిలో 170 మంది పేషెంట్ల డెడ్ బాడీలను దవాఖాన పరిసరాల్లోనే గొయ్యి తీసి పాతిపెట్టాల్సి వచ్చిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు కంపుకొడుతుండటం, వాటిని బయటకు తీసుకెళ్లి పాతిపెట్టే అవకాశం లేక పోవడంతో అక్కడే ఖననం చేసినట్లు పేర్కొన్నాయి.

గాజా హాస్పిటల్ కింద హమాస్ టన్నెల్ 

గాజాలోని ఓ ఆస్పత్రి కింద హమాస్ మిలిటెంట్లు ఏర్పర్చుకున్న టన్నెల్​ను ఇజ్రాయెల్ బయటపెట్టింది. బుల్లెట్ ప్రూఫ్ మూత, సోలార్ కరెంట్ సౌకర్యంతో 20 మీటర్ల లోతున ఆ టన్నెల్ ను నిర్మించుకున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరి వెల్లడించారు. రాంటిసి అనే హాస్పిటల్ బేస్ మెంట్​లోని టన్నెల్ ముఖద్వారం, అక్కడున్న వెపన్స్, ఇతర వస్తువులను చూపుతూ ఆయన వివరిస్తున్న ఓ వీడియోను ఇజ్రాయెల్ ట్వీట్​ చేసింది.

యుద్ధం కోసం రూ. 66 వేల కోట్ల అప్పులు  

హమాస్​తో యుద్ధం మొదలైనంక ఇజ్రాయెల్ రూ. 66,527 కోట్ల అప్పులు చేసినట్లు ఆ దేశ ఆర్థిక శాఖ ప్రకటించింది. యుద్ధ అవసరాలతో పాటు దేశీయ అవసరాలు, బార్డర్ గ్రామాల ప్రజలు, బందీల కుటుంబాలకు పరిహారం, సహాయ చర్యలకు, ఇతర అవసరాల కోసం మొత్తం 3 వేల కోట్ల షెకెల్స్ (800 కోట్ల డాలర్లు) అప్పులు చేసినట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బాండ్లను వేలం వేయడం ద్వారా ఈ అప్పులు చేసినట్లు పేర్కొంది.

ఈజిప్టుకు చేరిన కాశ్మీర్ మహిళ

గాజాలో చిక్కుకుపోయిన జమ్మూ కాశ్మీర్ మహిళ లుబ్నా నాజిర్ షబూ సోమవారం సాయంత్రం సేఫ్​గా రఫా బార్డర్ ద్వారా ఈజిప్టుకు చేరుకున్నారు. ఇండియన్ ఎంబసీ అధికారుల సాయం తో లుబ్నా మంగళవారం కైరో సిటీకి బయలుదేరిందని ఆమె భర్త నెదల్ తోమన్ ట్విట్టర్​లో వెల్లడించారు.