హ్యామ్ రోడ్లకు ఆర్బీఐ లింక్..మూడోసారి వాయిదా పడిన టెండర్లు

హ్యామ్ రోడ్లకు ఆర్బీఐ లింక్..మూడోసారి వాయిదా పడిన టెండర్లు
  • 60 శాతం పెండింగ్ బిల్లుల చెల్లింపునకు బ్యాంకు గ్యారంటీ జీవో ఇచ్చిన ప్రభుత్వం
  • అయినా ముందుకు రాని కాంట్రాక్టర్లు 
  • ఆర్బీఐ అనుమతి కోసం లెటర్ రాసిన సర్కారు 
  • అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తేనే టెండర్లు వేసే చాన్స్​

హైదరాబాద్, వెలుగు :  రిజర్వ్ బ్యాంక్ ఇండియా(ఆర్బీఐ) నుంచి అనుమతి వస్తేనే రూ.16,800 కోట్లతో చేపట్టనున్న హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల పనులు ముందుకు సాగనున్నాయి. 60 శాతం పెండింగ్​బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో బ్యాంక్​గ్యారంటీ జీవో ఇచ్చింది. అయినా కాంట్రాక్టర్ల నుంచి కోరుకున్న స్థాయిలో టెండర్లు పడలేదు. దీంతో ఆఫీసర్లు టెండర్లు తెరవకుండానే మూడోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఆర్​బీఐ అనుమతి కోసం సర్కారు లేఖ రాసింది. అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్​ వస్తేనే టెండర్లు పడే చాన్స్ ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

నాలుగు నెలలుగా నో రెస్పాన్స్..

హ్యామ్​రోడ్లకు టెండర్లు పిలిచి నాలుగు నెలలు దాటినా కాంట్రాక్టర్ల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లలను దశలవారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ విధానంలో పనులు చేపట్టడానికి గతేడాది జూన్​20న జీవో జారీ చేసింది.

ఆర్అండ్​బీ శాఖ పరిధిలో రూ.10,547 కోట్లతో 5,566 కిలో మీటర్ల రోడ్ల పనులను 32 ప్యాకేజీలుగా, పంచాయతీ రాజ్ శాఖ తరఫున రూ.6294.81 కోట్ల ఖర్చుతో 7,449.50 కిలో మీటర్ల మేర చేపట్టాల్సిన పనులను 17 ప్యాకేజీలుగా విభజించి గత అక్టోబర్​లో టెండర్లు పిలిచారు.

బిల్లుల చెల్లింపులో కొత్త నిబంధన తీసుకొచ్చారు. రోడ్డు నిర్మాణ పనులు స్టార్ట్​ చేసినప్పుడు అడ్వాన్స్​మొబిలైజేషన్ కింద 10 శాతం, వర్క్​ ముగిసేనాటికి 30 నెలల్లో బ్యాలెన్స్​డబ్బుల్లో 30 శాతం నిధులు చెల్లిస్తారు. మిగిలిన 60 శాతం నిధుల చెల్లింపునకు 15 ఏండ్ల గడువు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 96 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని13 వేల కిలో మీటర్ల ఆర్​అండ్​బీ, పంచాయతీ రాజ్​రోడ్లను డెవలప్ చేయడానికి పిలిచిన టెండర్లు మూడోసారి వాయిదా పడ్డాయి. టెండర్లను తెరవకుండా ఆఫీసర్లు వాయిదా వేస్తున్నారు.  

60 శాతం బిల్లులపైనే అంతా పేచీ..

హ్యామ్ రోడ్ల విధానంలో జరిగే పనులకు సంబంధించి పెండింగ్​లో ఉండే 60 శాతం బిల్లుల చెల్లింపు దగ్గరే అసలు పేచీ వస్తుంది. మొత్తం కేటాయించిన నిధుల్లో రూ.10 వేల కోట్ల బిల్లులను ప్రభుత్వం 15 ఏండ్లలో విడతలవారీగా చెల్లిస్తామని చెబుతోంది.

దీనిపై ముందుగానే కాంట్రాక్టర్లకు తెలియచేస్తూ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. పనులు పూర్తయ్యాక ‘ప్రభుత్వం మారితే.. కొత్తగా ఏర్పడిన సర్కారు పెండింగ్​బిల్లులు చెల్లిస్తారని ఏంటీ గ్యారెంటీ..?’ అని పదే పదే ప్రశ్నిస్తున్నారు. 

కర్నాటకలో ఇదే విధానం అనుసరించినప్పటికీ అక్కడ 15 ఏండ్లపాటు టోల్ వసూలుకు అవకాశమిచ్చారని, కానీ.. ఇక్కడ ఆ పరిస్థితి లేనందున తమ సంస్థలు దివాళా తీస్తాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీంతో బ్యాంకర్లతో ఎన్ని సమావేశాలు పెట్టినా పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. దీంతో ఇంజినీర్లు టెండర్ గడువు పెంచుకుంటూ పోతున్నారు. ఆర్ అండ్​బీ శాఖలోనే కాదు.. పంచాయతీ రాజ్ టెండర్ల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది.

ఆర్బీఐ అనుమతి కోసం లెటర్ రాసిన సర్కారు..

హ్యామ్​విధానంలో చేపట్టబోయే రోడ్ల నిర్మాణ పనులకు చెల్లించాల్సిన 60 శాతం నిధుల విషయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తూ జీవో జారీ చేసింది. పనులు చేపట్టిన కాంట్రాక్ట్​సంస్థకు తమ గవర్నమెంట్​ఉన్నా.. లేకపోయినా విడతలవారీగా 15 ఏండ్లపాటు పెండింగ్ బిల్లులు చెల్లించేలా జీవోలో పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్​మాదిరిగానే ఏ గవర్నమెంట్​వచ్చినా హ్యామ్​రోడ్ల బిల్లులు ఆపకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంజినీర్లు సంబంధిత కాంట్రాక్ట్​సంస్థలకు తెలియచేసింది. అయినా కూడా కాంట్రాక్టర్లు పనులు చేపట్టడానికి పెద్దగా ముందుకు రావట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఆర్బీఐ నుంచి అనుమతులు వస్తే గానీ తాము ముందుకు రాలేమని చెప్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై ఆర్బీఐకి లేఖ రాసింది. దీనిపై త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. 

టెండర్​గడువును మరోసారి పెంచినం..

హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల గడువు ముగిసినా తెరవలేదు. మార్చి 5వ వరకు మరోసారి గడువు పెంచినం. 60 శాతం పెండింగ్​బిల్లుల చెల్లింపు విషయంలో బ్యాంకు గ్యారంటీపై ఆర్బీఐ నుంచి అనుమతులు తీసుకోవడానికి ప్రభుత్వం లేఖ రాసింది. ఆర్బీఐ నుంచి అనమతులు వస్తే తాము పనులు చేస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఆ లేఖ కోసం ఎదురుచూస్తున్నాం.  

వెంకటేశ్వర్​రావు, ఇన్​చార్జి సీఈ
హ్యామ్​రోడ్స్​ విభాగం
ఆర్​అండ్​బీ శాఖ, హైదరాబాద్