కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఫ్లోరైడ్ ఉన్న నీళ్లు తాగడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చదువుతుంటాం. అలాంటివాళ్ల కోసం ఐఐటి ముంబైకి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ అర్పిత్ ఉపాధ్యాయ్, మోహిత్ జజోరియా ఒక వాటర్ ప్యూరిఫైయర్‌ని తయారుచేశారు. ఈ మధ్య కాలంలో మంచినీళ్ల కోసమని చాలామంది ఆర్‌వో వాటర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకుంటున్నారు. లేదంటే క్యాన్ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అవేవీ ఉండవు. వాళ్లు నీళ్లు తాగడానికి ఇప్పటికీ చేతి పంపులు, చెలిమలే దిక్కు. ఆ నీళ్లలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల చాలామందికి పోలియో, ఎముకల సమస్యలు, పళ్లు పచ్చబడటం, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. వాటివల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకున్నవాళ్ల వరకు ఇబ్బందులు పడుతున్నారు. మంచానికే పరిమితం అవుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ కారణం నీళ్లలో టిడిఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్) శాతం 2000 దాటడమే అని చెప్తున్నారు సైంటిస్ట్‌లు. అయితే ఈ స్టూడెంట్స్ కనిపెట్టిన మెషిన్ నీళ్లలో టిడిఎస్ శాతాన్ని 150కి తగ్గించి మంచి నీళ్లని ఇస్తుందని చెప్తున్నారు.
కాంపిటీషన్ కోసం...
ఐఐటి ముంబైలో ఆరువారాల పాటు జరిగిన ‘ఇన్వెన్షన్ ఫ్యాక్టరీ ప్రోగ్రామ్’ కోసం హ్యాండ్ పంపు ప్యూరిఫైయర్‌ని తయారుచేశారు. అంటే చేతి పంపుకే ప్యూరిఫైయర్ ఉంటుంది. కరెంట్ లేకుండా పనిచేసే ఈ మెషిన్‌కు ఆ కాంపిటీషన్‌లో లక్ష రూపాయల ప్రైజ్ మనీతో సెకండ్ ప్లేస్ వచ్చింది. మేకర్ భవన్ ఫౌండేషన్ వాళ్లిచ్చిన 47,000 రూపాయలతో ఈ ఫిల్టర్‌ని తయారుచేశారు. దీంట్లో ఫిల్టర్ అయిన నీళ్లు టెస్టింగ్‌లో అన్ని రకాల సెక్యూరిటీ చెకప్‌లను దాటింది. మామూలు ఫిల్టర్ల ధర 10,000ల నుంచి 15,000 రూపాయల మధ్యలో ఉంటే ఈ హ్యాండ్ పంప్ ఫిల్టర్ మాత్రం 5,000ల రూపాయలకే దొరుకుతుందని చెప్తున్నారు వాళ్లు.
ఎలా పనిచేస్తుందంటే..
ఈ ఫిల్టర్ మూడు లెవల్స్‌లో పనిచేస్తుంది. హ్యాండ్ పంప్ (బోరింగ్) ద్వారా నీళ్లు ఫిల్టర్ లోపలికి పంపాలి. తరువాత కార్బన్, సెడిమెంట్, అల్ట్రా ఫిల్ట్రేషన్ పద్ధతిలో ఆ నీళ్లు ఫిల్టర్ అవుతాయి. అక్కడ నీళ్లలో ఉన్న చెత్త, వాసన, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్‌ని తొలగించి మంచి నీళ్లని ఇస్తుంది. ఏడు లీటర్ల నీళ్లు ఫిల్టర్ చేస్తే ఒక లీటర్ మంచి నీళ్లు వస్తాయి.
‘ఈ ఫిల్టర్ తయారుచేయడానికి చాలా కష్టపడ్డాం. ల్యాబ్‌లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు యాసిడ్ రియాక్షన్స్ జరిగి పేలాయి కూడా. అయినా భయపడలేదు. దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ఈ ఇన్వెన్షన్‌ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం’ అని చెప్తున్నారు అర్పిత్, మోహిత్.
