
- ఆగస్టు 17న హైదరాబాద్ కు గల్ఫ్ బాధితుడు
భీమదేవరపల్లి, వెలుగు: సౌదీలో చిక్కుకుపోయిన బాధితుడు ఎట్టకేలకు స్వదేశానికి తిరిగొస్తున్నాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి కొప్పూరుకి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ 2017లో ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. హౌజ్ డ్రైవర్, ఖర్జూర తోటలో కూలీగా పని చేస్తూ అక్కడే చిక్కుకుపోయాడు. ఇండియాకు రాలేక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి గైడ్ చేయడంతో ఈశ్వర్ భార్య తాళ్లపల్లి లత, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి గత జూన్ 27న హైదరాబాద్ సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించారు.
ఈశ్వర్ ను ఇండియాకు రప్పించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపారు. సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ తో చర్చించారు. సౌదీలోని ఇండియన్ ఎంబసీకి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాయించారు. దీంతో ఇండియన్ ఎంబసీ కో – ఆర్డినేషన్ తో కలిసి ఈశ్వర్ ను పంపించేందుకు చర్యలు తీసుకున్నారు.