- ఓరుగల్లును ముక్కలు చేసి అన్యాయం చేశారు
- వరంగల్ మహానగర ఏకీకరణ, పునర్నిర్మాణంపై చర్చలో వక్తలు
హనుమకొండ, వెలుగు: గత పాలకులు చారిత్రక నేపథ్యమున్న వరంగల్‌ను విభజించి అన్యాయం చేశారని, 1200 ఏండ్ల చరిత్ర ఉన్న నగరాన్ని రెండు ముక్కలు చేసి అభివృద్ధిని అడ్డుకున్నారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. వెంటనే హనుమకొండ, వరంగల్ జిల్లాలను ఏకం చేసి మహారాష్ట్రలోని నాగపూర్లెక్క డెవలప్చేయాలని డిమాండ్ చేశారు.
వరంగల్ మహానగర ఏకీకరణ, పునర్నిర్మాణం అనే అంశంపై కాజీపేట ఫాతిమానగర్‌లోని బాల వికాసలో మంగళవారం చర్చా కార్యక్రమం నిర్వహించారు. సామాజికవేత్త పింగళి సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మేయర్రాజేశ్వరరావు, రిటైర్డ్ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ విజయబాబు, ప్రొఫెసర్ విజయలక్ష్మి, ముత్తిరెడ్డి అమరేందర్ రెడ్డి, ఎండీ గుల్షన్, దారా జనార్ధన్, సోమరామూర్తి హాజరై ప్రసంగించారు.
ట్రైసిటీ ఒకే జిల్లాలో ఉండాలి
వరంగల్ నగరానికి చారిత్రక నేపథ్యం, రాజకీయ చైతన్యం, ఉన్నతంగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నా పాలనా సౌలభ్యం పేరుతో రెండు ముక్కలు చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించారని ఆర్గనైజర్పింగళి సంపత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ లోని ఇతర జిల్లాలతో సంబంధం లేకుండా వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీని ఒకే జిల్లాగా మార్చాలన్నారు.
వరంగల్ నగరం హైదరాబాద్నగరానికి ఒక కౌంటర్ మ్యాగ్నెట్ గా ఎదుగుతుందని, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో రెండు జిల్లాలను ఒక్కటిగా మార్చి సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని మాజీ మేయర్ రాజేశ్వరరావు కోరారు. భద్రకాళి గుడి, వరంగల్ జైలు, కేసీఎం, కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నగరానికి గుర్తింపు తెచ్చాయని, అలాంటి నగరాన్ని రెండు ముక్కలు చేయడం ఇక్కడి ప్రజలకు కూడా ఇష్టం లేదన్నారు. ప్రొఫెసర్ విజయబాబు మాట్లాడుతూ వరంగల్ నగరంపై ఎన్ని దండయాత్రలు జరిగినా ఉనికి మాత్రం చెదిరిపోలేదన్నారు. గత పాలకులు మాత్రం నగరాన్ని ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓరుగల్లు అణచివేతకు గురైంది
తెలంగాణలో వరంగల్ ఉమ్మడి జిల్లా దారుణంగా అణిచివేత గురైందని, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, ఖమ్మం, కరీంనగర్ కంటే మరింత వెనుకబడి పోయిందని ప్రముఖ సామాజిక ఆర్థికవేత్త రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యాపార తయారీ పరిశ్రమల అభివృద్ధి కేంద్రంగా వరంగల్ ఎదగాల్సి ఉందన్నారు. కాజీపేట అభివృద్ధి కూడా వరంగల్ నగర అభివృద్ధిలో భాగం కావాలని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మడికొండలో ఐటీ ఇండస్ట్రీ, టైక్స్ టైల్పార్కు, ఇతర ఇండస్ట్రీలతో వ్యాపార కేంద్రంగా ఎదగాలని అభిప్రాయపడ్డారు.
దేశంలో అత్యంత ప్రాచీన సంస్కృతికి, శిల్ప కళకు, మేథావులకు నిలయమైన వరంగల్ మరింత ఎదగాల్సిన అవసరం ఉందని ఫోరం ఫర్బెటర్వరంగల్అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ అన్నారు. వివిధ రాష్ట్రాల్లో రెండో రాజధాని నగరాల మాదిరిగా వరంగల్ డెవలప్ కావాల్సి ఉందన్నారు. ఓరుగల్లు సమగ్ర అభివృద్ధికి హనుమకొండ, వరంగల్ జిల్లాలను ఒక్కటి చేయాలని, అప్పటిదాకా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్లు పెద్ది వెంకట్ నారాయణ, రావుల సదానందం, రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లు నరసింగరావు, రాఘవేందర్, వివిధ సంఘాల సభ్యులు అల్లం మల్లికార్జున రావు, సాయిని నరేందర్, వడ్నాల నగేష్ , ముత్తిరెడ్డి అమరేందర్ రెడ్డి, ఎండీ గుల్షన్ పాల్గొని ప్రసంగించారు.