హనుమకొండలో ప్రసూతి ఆసుపత్రుల్లో రక్త నిధి కేంద్రాలు కరువు

హనుమకొండలో ప్రసూతి ఆసుపత్రుల్లో రక్త నిధి కేంద్రాలు కరువు
  • ఎమర్జెన్సీ టైమ్ లో పరుగులు పెడుతున్న పేషెంట్ల బంధువులు
  • బ్లడ్ బ్యాంకు కోసం ప్రపోజల్స్ పంపినా పట్టించుకోని లీడర్లు, పెద్దాఫీసర్లు
  • అత్యవసరమైతే ఎంజీఎంపైనే భారం
  • పేషెంట్ల బంధువులకు తప్పని ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో బ్లడ్​ బ్యాంకులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు సిజేరియన్​ చేస్తే రక్తం అవసరం ఉంటుంది. రక్త హీనత ఉన్నవారికైతే తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. దీంతో డెలీవరి చేసే టైమ్​ లో  బ్లడ్​ అవసరం ఉంటుందని  డాక్టర్లు పేషెంట్ల బంధువులకు చెబుతుండటంతో వారంతా రక్తం కోసం పరుగులు తీస్తున్నారు.ఇదివరకే హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోనే బ్లడ్​ బ్యాంక్​ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపోజల్స్​ పంపినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దాఫీసర్లు లెక్కచేయడం లేదు. ఇక సీకేఎం ఆసుపత్రిలో బ్లడ్​ స్టోరేజ్​ యూనిట్​ కోసం ఒక రూమ్​ను కేటాయించినప్పటికీ సరైన సిబ్బంది, ఎక్విప్​ మెంట్ లేక అది కూడా మూతపడింది. 

నిత్యం పదుల సంఖ్యలో డెలివరీలు

ఉమ్మడి వరంగల్ తోపాటు వివిధ జిల్లాల నుంచి ఎంతోమంది గర్భిణులు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి(జీఎంహెచ్​), వరంగల్ లోని చందా కాంతయ్య మెమోరియల్​(సీకేఎం) ఆసుపత్రులకు వస్తుంటారు. దీంతో ఈ రెండు ఆసుపత్రుల్లో కలిపి నిత్యం 150 నుంచి 200  వరకు ఓపీ నమోదు అవుతుండగా.. సగటున 40 నుంచి 60 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం సిజేరియన్​ కాన్పులే జరుగుతుండటంతో ముగ్గురు, నలుగురికైనా రక్తం అవసరం పడుతోంది.

ఎంజీఎంకే పంపిస్తున్నరు

డెలివరీ కోసం మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణుల్లో రక్త హీనతతో బాధపడేవాళ్లు కూడా ఉంటున్నారు. అలాంటి వారికి సిజేరియన్​ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా రక్తశాతం పెరిగేందుకు మెడిసిన్​ ఇస్తున్నా.. అనుకున్న మేర పెరగకపోవడంతో రక్తం అవసరం ఏర్పడుతోంది. దీంతో అక్కడి డాక్టర్లు పేషెంట్ల కండీషన్​ ను బట్టి ముందుగానే రక్తం కోసం రిజిస్ట్రేషన్​ చేయించుకోవాల్సిందిగా ఎంజీఎం ఆసుపత్రికి పంపిస్తున్నారు. అక్కడ రిజిస్ట్రేషన్​ చేసుకుని వస్తున్నా..  ప్రసవ సమయంలో అప్పటికప్పుడు ఎంజీఎం నుంచి రక్తం తీసుకురావడం చాలా కష్టతరమైన పని. జీఎంహెచ్​, సీకేఎం నుంచి ఎంజీఎం దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఉండటం, ట్రాఫిక్​ కూడా హెవీగా ఉంటుండటంతో అర్జంట్​గా రక్తం తీసుకెళ్లడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

ఎనిమిదేండ్ల కిందటే హామీ

100 బెడ్లతో ఉన్న ఈ రెండు ఆసుపత్రులను 200 బెడ్లకు అప్​ గ్రేడ్​ చేయాల్సిందిగా ఇక్కడి ఆఫీసర్లు ఎప్పటినుంచో స్థానిక లీడర్లు, జిల్లా పెద్దాఫీసర్లకు విన్నవిస్తూ వస్తున్నారు. దీంతో అప్పటి వైద్యారోగ్యాఖ మంత్రి డా.తాటికొండ రాజయ్య బ్లడ్‍ బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. బిల్డింగ్‍ కాంప్లెక్స్, బ్లడ్‍బ్యాంకు ఏర్పాటుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇది జరిగి ఎనిమిదేండ్లు దాటినా పట్టించుకునే నాథుడే లేడు. ఇక వరంగల్ సీకేఎంలో ఏడాదిన్నర కిందట బ్లడ్​ స్టోరేజ్​ యూనిట్​ ఏర్పాటు చేసినా.. ఎక్విప్​మెంట్​ ప్రాబ్లమ్స్​, స్టాఫ్​ లేని కారణంగా అది ఎప్పుడూ తాళం వేసే ఉంటోంది. దీంతో పేషెంట్లు ఎంజీఎం, రెడ్​ క్రాస్​కు పరుగులు తీయకతప్పడం లేదు.  ఇటీవల విషజ్వరాలు, ఇతరాల కారణాల వల్ల ప్లేట్​ లెట్స్​ తగ్గిపోతున్న కారణంగా  అక్కడా రక్తానికి కొరత ఏర్పడుతోంది. దీంతో నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసూతి ఆసుపత్రిలో బ్లడ్​ బ్యాంక్ లేకపోవడంతో పేషెంట్ల బంధువులను అవసరాన్ని బట్టి ఎంజీఎంకు పంపించి రక్తం తెప్పిస్తున్నాం. జీఎంహెచ్​లో బ్లడ్​ బ్యాంక్​ ఏర్పాటు విషయాన్ని ఇదివరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సాధ్యమైనంత తొందర్లో బ్లడ్ బ్యాంక్​ ఏర్పాటు చేసి పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‍ విజయలక్ష్మి, సూపరింటెండెంట్, జీఎంహెచ్​