గ్రామాభివృద్ధికి పాటు పడుతా : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

గ్రామాభివృద్ధికి పాటు పడుతా : ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు

వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: గ్రామాలాభివృద్ధికి పాటుపడతానని, ప్రతి గ్రామంలో బడి, గుడి అభివృద్ధికి  సహాయ సహకారాలు అందిస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని నందనం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. 

గ్రామపంచాయతీ భవనానికి స్థలం బహూకరించిన వారిని ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవన ప్రహరీ, ఇతర పనుల కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వర్ధన్నపేటలో రూ.200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ త్వరలోనే నిర్మాణం కాబోతుందని తెలిపారు. 

అలాగే మామునూరు ఎయిర్​పోర్ట్​ పనులు ప్రారంభించనున్నారని, ఇక్కడి నుంచి దేశ విదేశాలకు విమాన సర్వీసులు నడువనున్నట్లు చెప్పారు. నందనం నుంచి జగ్గయ్య గూడెం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరయ్యాయని, శ్మశాన వాటికకు కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జెట్టబోయిన రాజు, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు సమ్మెట మహేశ్​గౌడ్, పలు గ్రామాల సర్పంచ్ లు శంకర్ రెడ్డి, స్వాతి, దేవికారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.