ఇంటి ఫుడ్‌‌ కుదరదు.. హనుమాన్ చాలిసా తెచ్చుకోవచ్చు

ఇంటి ఫుడ్‌‌ కుదరదు.. హనుమాన్ చాలిసా తెచ్చుకోవచ్చు

న్యూఢిల్లీ: కో–లొకేషన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌‌ఎస్‌‌ఈ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను  జ్యుడిషియల్‌‌ కస్టడీకి స్పెషల్ కోర్టు పంపింది.  ఆమె 14 రోజుల పాటు  జైలులో ఉంటారు. హోమ్‌‌ ఫుడ్‌‌ను తెప్పించుకోవడానికి అనుమతి అడగగా, కోర్టు దీన్ని కోట్టేసింది. ‘ప్రతి ఖైది సమానమే. గతంలో ఆమె పొజిషన్‌‌ చూసి ఆమెను వీఐపీగా ఖైదీగా చూడలేము’ అని జడ్జ్‌‌ సంజీవ్‌‌ అగర్వాల్‌‌ అన్నారు. ఆమె తరపు న్యాయవాది జైలులో ప్రత్యేక సౌకర్యాలను కోరగా, ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. కానీ, హనుమాన్ చాలిసా, భగవత్‌‌ గీత వంటి ప్రార్ధన పుస్తకాలను తీసుకెళ్లడానికి కోర్టు అనుమతిచ్చింది. ఓ గుర్తు తెలియని యోగి చెప్పినట్టు ఎన్‌‌ఎస్‌‌ఈని ఆమె నడిపారని, కొంత మంది బ్రోకర్లకు లాభం చేకూరేలా పనిచేశారని సెబీ ఓ దర్యాప్తు రిపోర్ట్‌‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.  చిత్ర రామకృష్ణ తన అధికారాన్ని తప్పుగా వాడారని, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనంద్‌‌ సుబ్రమణియన్‌‌ను ఎన్‌‌ఎస్‌‌ఈ ఆపరేటింగ్‌‌ ఆఫీసర్‌‌‌‌ నుంచి ఎండీగా ప్రమోట్ చేశారని సీబీఐ పేర్కొంది. ఎన్‌‌ఆర్‌‌‌‌సీ, కంపెనీ బోర్డుకి చెప్పకుండా ఈ నిర్ణయం ఆమె తీసుకున్నారని వివరించింది. ఎన్‌‌ఎస్‌‌ఈ ఎండీగా చేయడంతో సుబ్రమణియన్‌‌కు ఎన్‌‌ఎస్‌‌ఈకి సంబంధించిన కీలక సమాచారం అందుబాటులో  ఉందని స్పెషల్ కోర్టుకి సీబీఐ తెలిపింది. ఎన్‌‌ఎస్‌‌ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌‌‌‌గా నియమితులు కాకముందే సుబ్రమణియన్‌‌కు, చిత్ర రామకృష్ణకు పరిచయం ఉందని పేర్కొంది.