700 మందిని పక్కకి నెట్టి హీరోయిన్‌గా

700 మందిని పక్కకి నెట్టి హీరోయిన్‌గా

హుమా ఖురేషీ.. ఒకప్పుడు బాలీవుడ్‌ వారికి మాత్రమే తెలిసిన ఈ పేరు.. ‘కాలా’ సినిమాతో సౌత్‌ వారికీ తెలిసింది. ఓటీటీల హవా పెరిగాక ఆమె చాలామంది తెలుగు ప్రేక్షకులకీ ఫేవరేట్ అయిపోయింది. ఈ నిలువెత్తు అందం ఇవాళే పుట్టింది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 

ఢిల్లీ టు ముంబై..

న్యూఢిల్లీలోని ఓ ముస్లిం కుటుంబంలో పుట్టింది హుమా. తండ్రి బిజినెస్‌మేన్. పది రెస్టారెంట్లు నడిపేవారు. తల్లి, ముగ్గురు బ్రదర్స్‌. ఇదీ హుమా ఫ్యామిలీ. హిస్టరీలో బ్యాచ్‌లర్‌‌ డిగ్రీ పూర్తి చేశాక నాటకాల వైపు అట్రాక్ట్ అయ్యింది హుమా. పలు డ్రామాస్‌లో నటించింది. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ తో కలిసి పని చేసింది. 2008లో ముంబై షిఫ్ట్ అయింది. ‘జంక్షన్’ అనే సినిమా కోసం ఆడిషన్‌కి వెళ్లింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కిందే లేదు. అయితే ఒ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. పైగా ఆ కంపెనీ ఆమెతో రెండేళ్ల కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకుంది. ఆ తర్వాత పలు యాడ్స్ లో నటించే చాన్స్‌ సంపాదించింది హుమా. ఇక అమిర్‌‌ఖాన్‌తో చేసిన ఒక యాడ్ ఆమె కెరీర్‌‌ని మలుపు తిప్పింది. దాంతో ఆమె బిజీ మోడల్ అయిపోయింది. 

సౌత్‌లో చాన్స్ వచ్చినా..

సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి కాస్త ఎక్కువ టైమే పట్టింది హుమాకి. నిజానికి ఆమెకి మొదట చాన్స్ వచ్చింది సౌత్‌లోనే. అజిత్ హీరోగా నటించిన తమిళ మూవీ ‘బిల్లా 2’ ఆడిషన్స్ కు వెళ్లింది హుమా. ఏడొందల మందిని పక్కకి నెట్టి హీరోయిన్‌గా సెలెక్టయ్యింది. కానీ ఆ సినిమా లేటవ్వడంతో మోడలింగ్ కమిట్‌మెంట్స్ కు ఇబ్బంది అవుతుందని పక్కకు తప్పుకుందామె. చివరికి 2012లో అనురాగ్ కశ్యప్ తీసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్‌‌’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో చేసిన పాత్రకి మంచి పేరు రావడంతో వరుస అవకాశాలు లభించాయి. అదే యేడు ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్‌‌ 2’తో పాటు మరో రెండు సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాతి యేడు మూడు సినిమాలు చేసింది. ఇక తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అయితే సౌత్‌లో యాక్ట్ చేయడానికి మాత్రం నాలుగేళ్లు పట్టింది హుమాకి. ‘వైట్’ అనే మలయాళ సినిమాలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత ‘కాలా’లో రజినీకాంత్ లవర్‌‌గా కనిపించింది. ఈ మధ్యనే వచ్చిన ‘వలీమై’లోనూ కీలక పాత్ర చేసింది. 

ఓటీటీ క్వీన్..

తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఏ రూపంలో వచ్చినా వదులుకోలేదు హుమా. అదే ఈరోజు ఆమెని బిజీ యాక్ట్రెస్‌ని చేసింది. ఓవైపు సినిమాలు చేస్తూనే మ్యూజిక్ వీడియోస్‌లో కనిపించింది. ‘ఉపనిషద్ గంగ’ అనే టెలివిజన్ సిరీస్ చేసింది. షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ఇండియాస్ బెస్ట్ డ్రీమ్‌బాజ్ అనే రియాలిటీ షో కూడా చేసింది. ఇక ఓటీటీలు వచ్చాక ఆమె స్టార్ తిరిగిందనే చెప్పాలి. లీల, మహారాణి, మిథ్య లాంటి సూపర్‌‌ హిట్ సిరీసుల్లో నటించి ఓటీటీ క్వీన్ అయిపోయింది. డబ్బింగ్ సినిమాలతో పాటు ఈ సిరీసులన్నీ తెలుగులో కూడా రావడంతో ఆమె తెలుగువారి మనసులు కూడా దోచుకుంది. త్వరలో ‘మహారాణి’ సీజన్‌ 2తో రాబోతోంది. ఇక  ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మోనికా ఓ మై డార్లింగ్, డబల్ ఎక్సెల్, తర్లా, పూజా మేరీ జాన్‌ మూవీస్‌లో నటిస్తోంది. మరికొన్ని చిత్రాలు, సిరీసులు లైన్‌లో ఉన్నాయి. 

క్లారిటీ అండ్ ప్యూరిటీ..

ఆలోచనల్లో క్లారిటీ, మాటల్లో ప్యూరిటీ.. ఈ రెండూ హుమా ప్రత్యేకతలు. ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది. ఆమె చక్కగా చదువుకుంది. ఇష్టమైన నటనను కెరీర్‌‌గా ఎంచుకుంది. ఓవైపు ఎన్జీవోలతో కలిసి సోషల్ సర్వీస్ చేస్తుంది. కొవిడ్ టైమ్‌లో వంద బెడ్లు, ఆక్సిజన్ ప్లాంట్‌తో టెంపరరీ హాస్పిటల్ ఫెసిలిటీని సైతం కల్పించింది. మెంటల్ హెల్త్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతుంది. బాడీ షేమింగ్‌ని తప్పుబడుతూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్స్ ఇస్తుంది. చేసే ప్రతి పనిలో తాను మానసికంగా ఎంత స్ట్రాంగ్‌ అనేది తెలిసేలా చేస్తుంది. అందుకే నటిగానే కాక, వ్యక్తిగానూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించింది హుమా ఖురేషీ.