టబు..ఎవర్ గ్రీన్ హీరోయిన్

టబు..ఎవర్ గ్రీన్ హీరోయిన్

అందం.. అభినయం ఆమె సొంతం. భాష ఏదైనా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది నటి టబు. తన రూపంతో సినీ ప్రియుల్ని కట్టిపడేసింది. టాలీవుడ్‭తో మొదలుపెట్టి హాలీవుడ్ వరకు దిగ్విజయంగా సినీ మజిలీ కొనసాగించింది. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు దక్కించుకున్న తబుస్సమ్..​ అలియస్ టబు  52వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. 

టబు అసలు పేరు తబు‌స్సుమ్‌ హష్మీ. 1971 నవంబరు 4న హైద‌రా‌బా‌ద్‌లో జన్మిం‌చింది. తండ్రి జమాల్‌ హష్మీ, తల్లి రిజ్వానా. ఆమె ఓ స్కూల్‌ టీచర్‌. బాల్యంలో ఉండ‌గానే తల్లి‌దం‌డ్రు‌లి‌ద్దరూ విడి‌పో‌యారు. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీ‌లకి టబు స్వయానా మేన‌కో‌డలు. సినిమాలపై ఆసక్తితో చిన్నతనంలోనే ముంబయి వచ్చింది.  'బజార్' అనే హిందీ చిత్రంతో బాలనటిగా చిన్న పాత్ర పోషించిన టబు.. ఆ తర్వాత 'హమ్​ నే జవాన్​'లోనూ మెరిసింది. ఈ సినిమాలోని నటన ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను టబు ఆకట్టుకుంది. 

తెలుగులో హీరోయిన్ గా ఆరంగేట్రం

ముందుగా టబు పేరు చెబితే తెలుగు సినీ ప్రేక్షకులకు కూలీ నెంబర్ 1 చిత్రం గుర్తొస్తుంది. ఈ సినిమాతో టబు తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. వెంకటేశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. 1991లో ప్రేక్షకుల ముందుకొచ్చిన కూలీ నెంబర్ 1 చిత్రం చక్కటి ఆద‌రణ పొందింది. టబు తనదైన శైలిలో నటించి అందరిని ఆకట్టుకుంది. టాలీవుడ్​లో తక్కువ సినిమాలే చేసినా గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించింది. ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అంద‌రి‌వాడు, పాండు‌రం‌గడు, ‘ఇదీ సంగతి' తదితర చిత్రాల్లో నటించి అల‌రిం‌చింది. ఆమె తమి‌ళంలో నటిం‌చిన కాదల్‌ దేశమ్‌ తెలు‌గులో ప్రేమ‌దే‌శంగా విడు‌దలై ఘన‌వి‌జయం అందుకుంది. ఆ తర్వాత నాగార్జున హీరోగా.. టబు హీరోయిన్ గా తెరకెక్కిన నిన్నే పెళ్లాడతా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో పాటలు ఆల్ టైమ్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికీ ఈ పాటలను విని డ్యాన్స్ చేయని వారుండరు అంటే అతిశయోక్తి లేదు. గ్రీకు వీరుడు నా రాకుమారుడు అంటూ టబు తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ రెండు సినిమాలు ఒక ఎత్తు అయితే.. ప్రేమదేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు హీరోల సరసన ప్రేమదేశంలో టబు యువరాణిలాగే కనిపించి తన నటనతో మెప్పించారు. 

జాతీయ అవార్డుకు ఎంపిక.. పద్మ శ్రీతో సత్కారం

బాలీవుడ్ లోనూ టబు మంచి పేరు సంపాదించింది. 1994లో అజయ్​దేవగణ్​ సరసన 'విజయాపథ్'​లో నటించి తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. బాలీవుడ్​లోనే కాకుండా హాలీవుడ్​లోనూ నటనతో మెప్పించింది టబు. ‘ది నేమ్‌ సేక్‌, 2012లో విడు‌ద‌లైన ‘లైఫ్‌ ఆఫ్‌ పై’లోనూ ఓ కీలక పాత్ర పోషించి అల‌రిం‌చింది. హిందీలో చేసిన 'చీనీ‌కమ్‌' కూడా అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మాచిస్ అనే పొలిటికల్ థ్రిల్లర్ లో ఆమె నటించింది. ఇందులో చంద్రచూర్ సింగ్, ఓం పురి, జిమ్మీ షీర్‌గిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. టబు 2005లో జరత్ విద్యాపీఠ్ చిత్రంలో తన నటనకు మొదటి జాతీయ అవార్డును అందుకుంది.  టబు రెండు సార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారం దక్కించుకుంది. మాచిస్, చాందిని బార్ సినిమాల్లో నటనకు నేషనల్ అవార్డులు అందుకుంది. ఇవే కాకుండా పలు ఫిల్మ్​ ఫేర్, ఐఫా పురస్కారాలు గెల్చుకుంది. 2011లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ'తో టబును గౌరవించింది.