హ్యాపీ బర్త్ డే రహానే

హ్యాపీ బర్త్ డే  రహానే

భారత క్రికెట్లో అంజిక్య రహానేది ప్రత్యేకమైన స్థానం. మిడిలార్డర్ బ్యాట్సమన్గా అతను ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించిన సందర్బాలున్నాయి. రహానే స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా  రాణిస్తాడని సెలక్టర్లు నమ్ముతుంటారు. అందుకే ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా దేశంలో పర్యటించే భారత జట్టులో అతడు కచ్చితంగా ఉంటాడు. ఇక రహానే కెప్టెన్సీలో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫి గెలవడం విశేషం. ఈ  సిరీస్లో సెంచరీల మోత మోగించి..జట్టును విజేతగా నిలిపాడు. సోమవారం అతని 34వ పుట్టిన రోజు సందర్భంగా..రహానే క్రికెటర్ కెరియర్లో ఆసక్తికర విశేషాలు..

1988 జూన్ 6న మహరాష్ట్రలోని అశ్వికేడి గ్రామంలో పుట్టిన అతను..ఏడేళ్ల వయసులో బ్యాట్ పట్టాడు. అయితే 17వ ఏట అతను మాజీ క్రికెటర్ ప్రవీణ్ అమ్రే దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకుని రాటుదేలాడు. అయితే2007లో భారత అండర్ –19 జట్టు న్యూజిలాండ్లో పర్యటించింది. టీమ్ లో సభ్యుడైన రహానే.. రెండు సెంచరీలు చేయడంతో..ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.  ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన రహానే..2011లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ–20ల్లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లాండ్తోనే తొలి వన్డే ఆడాడు.  ఆ తర్వాత రెండు సంవత్సరాలకు 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  11 ఏళ్ల వన్డే కెరియర్లో రహానే 90 మ్యాచులు ఆడి..2962 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలున్నాయి. 20 టీ–20 మ్యాచుల్లో 375 పరుగులే చేశాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. 9 ఏళ్ల టెస్టు కెరియర్లో రహానే 82 మ్యాచులు ఆడి..4931 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలున్నాయి. 

రహానే గ్రేట్ టెస్టు సెంచరీలు..
రహానే క్రికెట్ కెరియర్లో వన్డేలు, టీ–20ల కంటే టెస్టుల్లోనే అతను సత్తా చాటాడని చెప్పొచ్చు.  2020లో మెల్ బోర్న్ స్టేడియంలో రహానే చేసిన 112 పరుగులు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆస్ట్రేలియాలో విజిటింగ్ బ్యాట్సమన్ చేసిన గొప్ప సెంచరీలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. 4 టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భాగంగా ఫస్ట్ టెస్టులో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. అటు కెప్టెన్ కోహ్లీ తనకు బిడ్డపుట్టినందుకు భారత్ తిరిగొచ్చాడు. ఓవైపు ఓటమి..మరోవైపు కెప్టెన్ లేడు..పైగా తొలి టెస్టులో భారత్..టెస్టు చరిత్రలో అత్యల్పంగా 36 పరుగులకే ఆలౌట్ అయింది. తీవ్ర ఒత్తిడిలో భారత్.. రహానే కెప్టెన్సీలో  ఆసీస్తో రెండో టెస్టులో బరిలోకి దిగింది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 61 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి దశలో రహానే బ్యాటింగ్ కు దిగాడు. కొద్ది సేపటికే ఇండియా మరో వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో రహానే పోరాటం ఆమోఘం. రవీంద్ర జడేజా. హనుమ విహారి, పంత్తో కలిసి విలువైన పాట్నర్ షిప్లు నమోదు చేస్తూ..సెంచరీ చేశాడు. దీంతో భారత్ 326 రన్స్ చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్లోనూ భారత్ రాణించడంతో..ఆ టెస్టులో టీమిండియా విజయం సాధించింది. 

మెల్ బోర్న్లో 147 రన్స్..
2014 జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో మూడో టెస్టులో రహానే చేసిన 147 పరుగుల ఇన్నింగ్స్  క్లాసిక్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. 4 మ్యాచ్ ల సిరీస్లో అప్పటికే ఆసీస్ 2–0తో లీడ్లో ఉంది. ఈ దశలో మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 530 పరుగులు చేసింది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత్..147 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో బ్యాటింగ్కు  వచ్చిన రహానే..ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కోహ్లీతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. రహానే సెంచరీ  చేయడంతో భారత్ ఓటమి నుంచి బయటపడి ఆ టెస్టును డ్రాగా ముగించింది. 

లార్డ్స్లో 103 రన్స్..
క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్లో సెంచరీ చేయడం ప్రతీ బ్యాట్సమన్ కల. అంతేకాకుండా సెంచరీ చేసి..తన జట్టును గెలిపించాలని ప్రతీ క్రికెటర్ కోరుకుంటాడు.  ఈ రెండు కోరికలు నెరవేర్చుకున్నాడు రహానే. 2014లో లార్డ్స్ టెస్టులో అజింక్య 103 పరుగులతో చేలరేగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా..క్రీజులో కుదుర్కొని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 154 బంతుల్లో 103 పరుగులు చేయడంతో భారత్..295 రన్స్ చేసి పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో ఇతర బ్యాట్సమన్ రాణించడంతో ఆ టెస్టులో విజయం సాధించింది. 

126 వర్సెస్ శ్రీలంక..
2015లో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో రహానే చేసిన 126 పరుగులు ప్రత్యేకమే. ఫస్ట్ ఇన్నింగ్స్ లో రాహుల్ సెంచరీ, కోహ్లీ, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్..393 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం  భారత బ్యాట్సమన్ తడబడ్డారు. ఒక మురళీ విజయ్ తప్ప..మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ సమయంలో రహానే మరోసారి అపద్భాంధవుడయ్యాడు. 243 బంతులను ఎదుర్కొని 126 పరుగులు చేశాడు. రహానే సెంచరీతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత బౌలర్లు విజృంభించడంతో ..రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 134 పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది. 

118 వర్సెస్ న్యూజిలాండ్..
2014లో  భారత జట్టు న్యూజిలాండ్లో పర్యటించింది. రెండో టెస్టులో భారత్ ఓడిపోయే స్థితిలో నిలిచింది.  ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 165 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన జట్టును రహానే ఆదుకున్నాడు. న్యూజీలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 118 పరుగులు చేశాడు. దీంతో భారత్ 438 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది.  రెండో ఇన్నింగ్స్లో భారత్ రాణించడంతో..ఓడిపోయే టెస్టును డ్రా చేసుకుంది.