
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
జడ్చర్ల, వెలుగు: ప్రేమ, పెళ్లి పేరుతో ఒంటరి మహిళను వాడుకున్న వ్యక్తి మోజు తీరాక వేధింపులు ప్రారంభించాడు. తన స్నేహితులతో గడపాలని ఫోర్స్ చేస్తుండడంతో ఆమె జడ్చర్ల పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని విజయనగర్‌కు చెందిన వెంకటేశ్(54)కు మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్కాలనీకి చెందిన ఒంటరి మహిళ(37) పరిచయం అయ్యింది. తన భార్యతో గొడవలు జరిగి విడిపోయామని, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మహబూబ్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం కూడా చేశారు. మొదట్లో బాగానే ఉన్నా ఇటీవల తనతో పాటు తన స్నేహితులతో కూడా గడపాలని వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో శనివారం ఆమెకు ఫోన్‌చేసి జడ్చర్లకు రప్పించాడు. ఈ విషయంలో ఇద్దరికి గొడవ జరిగింది. ఎంతకూ ఒప్పుకోకపోవడంతో మహబూబ్‌నగర్‌లో దింపి వస్తామని వెంకటేశ్‌తో పాటు అతని తమ్ముడు చిన్న వెంకటేశ్ మరో ఇద్దరు కారులో ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో అత్యాచారయత్నం చేయగా.. ఎలాగోలా తప్పించుకున్నది. సోమవారం ఉదయం జడ్చర్ల పీఎస్‌కు వెళ్లి సీఐ వీరస్వామి జరిగిన విషయం చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు ప్రైమరీ ఎంక్వైరీ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.