
చిన్నశంకరంపేట, వెలుగు : పెళ్లి అయిన నెల రోజులకే భర్త వేధిస్తుండడడంతో.. తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మంగళవారం (సెప్టెంబర్ 03) జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిన్నశంకరంపేటకు చెందిన విభూది రాధిక (19)కు అదే గ్రామానికి చెందిన వానరాశి కుమార్‌తో నెల రోజుల కిందే పెండ్లి జరిగింది. పెళ్లి అయిన వారం రోజుల నుంచే కుమార్ రాధికను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా కుమార్‌లో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
దీంతో మనస్తాపానికి గురైన రాధిక మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాధిక అమ్మమ్మ లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణ తెలిపారు.