స్పిన్ పిచ్ లు వద్దు..వరల్డ్ కప్ ఫైనల్ సీన్ రిపీట్ అవుతుంది: హర్భజన్ సింగ్

స్పిన్ పిచ్ లు వద్దు..వరల్డ్ కప్ ఫైనల్ సీన్ రిపీట్ అవుతుంది: హర్భజన్ సింగ్

స్వదేశంలో టెస్టు మ్యాచ్ అంటే స్పిన్ ట్రాక్ ఉండాల్సిందే. భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ అంటే ఏ జట్టయినా భయపడుతుంది. ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా మన స్పిన్ ధాటికి తలొంచాల్సిందే. భారత క్రికెట్ దశాబ్ద కాలంగా ఇదే కొనసాగుతుంది. అయితే కొన్నిసార్లు మనం తీసుకున్న గోతిలో మనమే పడే అవకాశం లేకపోలేదు. 2012 లో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో ఇదే జరిగింది. తొలి టెస్ట్ గెలిచిన మన జట్టు..ఆ తర్వాత ఇంగ్లాండ్ స్పిన్నర్లు గ్రేమ్ స్వాన్, మాంటి పనేసర్ ధాటికి తలొంచి సిరీస్ 1-2 తేడాతో ఓడిపోయింది.
 
ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై స్పిన్ పిచ్ ను తయారు చేసి బోల్తా పడ్డారు. ఈ నేపధ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ టీమిండియాను హెచ్చరించాడు.ఇంగ్లండ్‌పై టర్నింగ్ పిచ్‌ను సిద్ధం చేస్తే ప్రపంచ కప్ ఫైనల్‌ ఫలితం ఎదురవుతుందని హర్భజన్ భయపడుతున్నాడు. బ్యాటింగ్ లైనప్ లో అనుభవం లేదు. కుర్రాళ్ళు కుదురుకోవడానికి కొంత సమయం కావాలి. ప్రస్తుత జట్టులో రోహిత్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అశ్విన్. బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది' అని భజ్జీ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వ్యాఖ్యానించాడు.  

భారత్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా తొలి టెస్ట్ గెలిచిన ఇంగ్లాండ్ ఫుల్ జోష్ లో ఉంది. మరోవైపు ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు రాహుల్, జడేజా రూపంలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరమవ్వడం తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 న వైజాగ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, భారత క్రికెటర్లు వైజాగ్ చేరుకున్నారు. వ్యక్తిగత కారణాల వలన విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్ట్ లకు దూరమైన సంగతి తెలిసిందే.