అగ్రి వర్సిటీ వీసీ, మాజీ రిజిస్ట్రార్ స్కామ్​లపై విచారణ చేయించాలి : హరి ప్రసాద్

అగ్రి వర్సిటీ వీసీ, మాజీ రిజిస్ట్రార్ స్కామ్​లపై విచారణ చేయించాలి : హరి ప్రసాద్

గండిపేట్,వెలుగు: బీఆర్ఎస్ పాలనలో పెత్తనం చలాయిస్తూ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ భూములను ధారాదత్తం చేసి భారీ కుంభకోణాలకు పాల్పడిన వీసీ ప్రవీణ్ రావు పై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ విద్యార్థి విభాగం తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ఆర్.హరి ప్రసాద్ నాయక్ డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ భూములను ఎస్సీ, ఎస్టీ నిధులను అగ్రి హబ్ నిర్మాణంలోనూ భారీ స్కామ్ లకు వీసీ ప్రవీణ్ రావు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.  

వీసీ ప్రవీణ్ రావు, మాజీ రిజిస్ట్రార్ సుధీర్ బాబుపై తీవ్రస్థాయిలో విద్యార్థి నేతలు మండిపడ్డారు.  వర్సిటీ వద్ద గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రి హబ్ నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు అయితే.. కేవలం స్టీల్ పిల్లర్లతో నిర్మాణం చేపట్టి మిగతా నిధులను ఎస్సీ, ఎస్టీ నిధులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో వంద ఎకరాల వర్సిటీ భూములను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు.  2014 ఏడాదికి  ముందే వీసీ ప్రవీణ్ రావు, మాజీ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ రిటైర్డ్ అయ్యారని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక జీవో తెప్పించుకొని పదవిలో కొనసాగుతూ ప్రభుత్వ ఖజానాని దోచుకున్నారని మండిపడ్డారు. 

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, కార్పొరేట్  సంస్థ ప్రెస్టేజ్ సిటీ..కెన్ వర్త్..అనే రియల్ సంస్థలకు వర్సిటీలోని పెట్రోల్ బంక్ తదితర సంస్థలకు భూములను ధారాదత్తం చేసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వీసీ రిజిస్ట్రార్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో వెంటనే విచారణ చేపట్టి వర్సిటీ కోల్పోయిన ఆస్తులను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ప్రవీణ్ రావు, సుధీర్ బాబుపై విచారణ చేయించి అక్రమంగా సంపాదించిన ఆస్తులను రాబట్టాలని, వర్సిటీ ఆస్తులను కూడా పరిరక్షించాలని విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.