
- సూర్యకుమార్‌కు జరిమానాపై బీసీసీఐ అప్పీల్ !
దుబాయ్: ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య గ్రౌండ్ బయట వాతావరణం హీటెక్కింది. గత ఆదివారం ఇండియాతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో అతి చేసినందుకు పాక్ పేసర్ హరీస్ రవూఫ్ పై చర్యలు తీసుకున్న మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించాడు. అదే మ్యాచ్‌లో ఫిఫ్టీ తర్వాత గన్ షాట్ తరహాలో సంబరాలు చేసుకున్న మరో పాక్ ఆటగాడు సాహిబ్జదా ఫర్హాన్‌ను వార్నింగ్‌తో విడిచిపెట్టాడు. ఈ మేరకు శుక్రవారం విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
మరో వైపు, పాక్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్ అనంతరం రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కూడా మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, ఇండియాసైనిక దళాలకు ఆ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు సూర్యకుమార్ వ్యాఖ్యానించడంపై పాక్ ఫిర్యాదు చేసింది. అయితే, మ్యాచ్ రిఫరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇండియా అప్పీల్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరుకు ముందు ఇరుజట్ల కీలక ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు తీసుకోవడం టోర్నీలో తీవ్ర ఉత్కంఠను రేపింది.