- ఓట్ల రాజకీయం తప్ప రేవంత్‌కు రాష్ట్రంపై శ్రద్ధ లేదు: హరీశ్ రావు
- అబద్ధాలు, మాయమాటలతో రేవంత్ గద్దెనెక్కిండని ఆరోపణ
సిద్దిపేట రూరల్/హైదరాబాద్, వెలుగు: అబద్ధాలు, మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండని, ఆయనకు ఎంతసేపు ఓట్ల రాజకీయం తప్ప రాష్ట్రం మీద, ప్రజల మీద శ్రద్ధ లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి, కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్లను సైతం ఉడగొట్టి, 17 శాతంతో మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తూ బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం కూలిందని ప్రచారం చేశారని, మరి మల్లన్నసాగర్‌లో, కొండపోచమ్మలో నీళ్లేక్కడివని ప్రశ్నించారు. 2009 నవంబర్ 29.. చరిత్రను మలుపు తిప్పిన రోజని, నవంబర్ 29 లేకపోతే, డిసెంబర్ 9 లేదని, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదని, జూన్ 2 లేకపోతే తెలంగాణ ఎక్కడిది, రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిదని ప్రశ్నించారు.
తెలంగాణ వచ్చింది కాబట్టే సిద్దిపేట జిల్లా అయిందని, గోదావరి జలాలు, రైలు, మెడికల్ కాలేజీ వచ్చిందని, దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా రాష్ట్రం మారిందన్నారు. కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజు సిద్దిపేటలో పాత బస్టాండ్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేశామని, 1,531 రోజులు దీక్ష శిబిరం నడిచిందని గుర్తుచేశారు. ఆ ఉద్యమ జ్ఞాపకాల కోసం క్యాంపు ఆఫీస్ ముందు పైలాన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, వంటేరు ప్రతాప్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాళోజీ వర్సిటీ అక్రమాలపై చర్యలేవీ ?
కాళోజీ హెల్త్ వర్సిటీ కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారిందని హరీశ్ రావు మండిపడ్డారు. వర్సిటీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో మెడికల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
మెడికల్ స్టూడెంట్ల రీవాల్యూయేషన్ ప్రక్రియపై ఆరోపణ లు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. పీజీ పరీక్షల్లో ఫెయిలైన ఐదుగురు విద్యార్థులు కొద్ది రోజుల్లోనే ఎలా పాస్ అయ్యారని నిలదీశారు. ఈ అక్రమాల వెనుక వర్సిటీ వైస్ చాన్సలర్ నందకుమార్ రెడ్డి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ స్కామ్ వెనుక ప్రభుత్వ పెద్దలు ఎవరని నిలదీశారు. వర్సిటీ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం గవర్నర్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) చైర్మన్‌కు హరీశ్ రావు లేఖలు రాశారు.
