- మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణ
- దసరా వస్తున్నా ఇప్పటివరకు లాభాలను డిక్లేర్ చేయలేదు
- రూ.6,394 కోట్ల నుంచి రూ.1,800 కోట్లకు పడిపోయిన లాభాలు
- 70 నుంచి 58 మిలియన్ టన్నులకు పడిపోయిన బొగ్గు ఉత్పత్తి
- సీఎం బామ్మర్దికి కాంట్రాక్టులు కట్టబెట్టడం వల్లే సంస్థకు నష్టం
- ఈనెల 14న సింగరేణి కార్మిక గర్జన సభ నిర్వహిస్తామని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థను సమస్యల వలయంలోకి నెట్టేసి సంక్షోభంలో ముంచేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. పాలకుల అవినీతి, బంధుప్రీతి, పరిపాలనా వైఫల్యాల వల్ల కార్మికులే కాకుండా ఉన్నతాధికారులు సైతం నడిరోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు.
బీఆర్‌ఎస్ పాలనలో బొగ్గు ఉత్పత్తి ఏటేటా రికార్డు స్థాయికి చేరితే, కాంగ్రెస్ రాగానే ఉత్పత్తి ఎందుకు తగ్గిందో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2023–24లో 70 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి.. 2025–26 నాటికి 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని, ఏకంగా 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. నిజాయితీగా పనిచేసే డైరెక్టర్లు, అధికారులను తొలగించి, సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఈనెల 14న రామగుండంలో ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
దసరా వస్తున్నా లాభాల ఊసే లేదు..
దసరా పండుగ దగ్గరపడుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం లాభాలను డిక్లేర్ చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గరిష్టంగా 32 శాతం వరకు లాభాల వాటా ఇస్తే.. కాంగ్రెస్ మొదటి ఏడాది 33 శాతం అని చెప్పి, కేవలం 16 శాతమే ఇచ్చిందన్నారు. భవిష్యత్ అవసరాల పేరిట నిధులను పక్కనబెట్టి, 2024–25లో ఇచ్చింది కేవలం 12.5 శాతం మాత్రమేనని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో లాభాలు రూ.6,394 కోట్లు ఉంటే.. ఈ ఏడాది ఆ లాభాలు రూ.1,800 కోట్లు కూడా దాటే పరిస్థితి లేదన్నారు. ఏకంగా మూడు వంతుల మేర లాభాలు ఆవిరైపోయాయని చెప్పారు. ఔట్‌పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్ గతంలో 6.39 టన్నులు ఉంటే, ఈ ఏడాది 7.56 టన్నులకు పెరిగిందని గుర్తుచేశారు. సంస్థ నష్టాల బాట పట్టడానికి ప్రభుత్వ అవినీతే కారణమన్నారు. రేవంత్ రెడ్డి తన బామ్మర్దికి టెండర్లు కట్టబెట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు.
జీతాల కోసం రూ.4 వేల కోట్ల ఓడీ
ప్రభుత్వం, జెన్‌కోల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలను విడుదల చేయకుండా సంస్థను ఆర్థికంగా దివాళా తీయిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రూ.4,000 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ) తేవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కార్మికులకు ఇండ్ల స్థలాల యాజమాన్య హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో 2019లో కేసీఆర్ ‘జీవో 76’ తెచ్చి 30 వేల మందికి ఇండ్ల రిజిస్ట్రేషన్లు చేయించారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 20 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలపై అప్రకటిత నిషేధం విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
