ఇండియన్ ఐటీ కంపెనీలకు అమెరికా బిగ్‌‌ షాక్‌‌

ఇండియన్ ఐటీ కంపెనీలకు అమెరికా బిగ్‌‌ షాక్‌‌
  •     గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్‌‌ నుంచి ఇన్ఫోసిస్‌‌, టీసీఎస్‌‌, విప్రో, హెచ్‌‌సీఎల్‌‌ను తొలగించిన ట్రంప్ ప్రభుత్వం
  •     మైక్రోసాఫ్ట్‌‌, కాగ్నిజెంట్‌‌, క్యాప్‌‌జెమినీపై కూడా వేటు
  •     అమెరికన్లకే మొదటి ప్రాధాన్యం: జేడీ వాన్స్

న్యూఢిల్లీ: విదేశీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ జారీకి కీలకమైన ‘పెర్మ్’ ప్రోగ్రామ్ నుంచి ఇండియన్ ఐటీ కంపెనీలను అమెరికా సస్పెండ్ చేసింది. గ్రీన్ కార్డ్ నిబంధనలను ఉల్లంఘించడం, మోసం ఆరోపణల నేపథ్యంలో టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్‌‌,  మైక్రోసాఫ్ట్‌‌, కాగ్నిజెంట్, క్యాప్‌‌జెమినీ సంస్థలను తొలగించింది. వైట్‌‌హౌస్‌‌లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌‌ జేడీ వాన్స్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మైక్రోసాఫ్ట్‌‌ ఒక అద్భుతమైన అమెరికన్ కంపెనీ. ఆ సంస్థ ఎదగాలని మేం కోరుకుంటున్నాం. కానీ, అది తోటి అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తూ ఎదగాలి. ‘అమెరికన్లకే మొదటి ప్రాధాన్యం’ అనేదే మా విధానం’’ అని తేల్చిచెప్పారు.అమెరికా గ్రీన్ కార్డ్ సిస్టమ్‌‌ను మైక్రోసాఫ్ట్ తీవ్రంగా దుర్వినియోగం చేసిందని వాన్స్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం.. ఏదైనా ఉద్యోగానికి స్థానిక అమెరికన్ పౌరులు దొరకనప్పుడు మాత్రమే కంపెనీలు విదేశీయులకు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే, మైక్రోసాఫ్ట్ గతేడాది 6 వేల మంది స్థానిక అమెరికన్ ఉద్యోగులను తొలగించి, అదే సమయంలో 6,300 హెచ్-1బి వీసాలు, దాదాపు 3 వేల గ్రీన్ కార్డులను పొందిందని, స్థానిక ఉద్యోగుల స్థానంలో విదేశీయులను తక్కువ వేతనాలకు నియమించుకుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

హెచ్‌‌1 బీ వీసాలపై ప్రభావం లేదు

హెచ్-1బీ  వీసాలను కంపెనీలు ఇప్పటికీ స్పాన్సర్ చేయొచ్చు. ఈ సస్పెన్షన్ హెచ్-1బీ వీసాలపై పడలేదు. ఇది కేవలం గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాస హోదా) దరఖాస్తు ప్రక్రియకు మాత్రమే పరిమితమైంది. అమెరికా ప్రభుత్వం ‘పెర్మ్’ (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌‌మెంట్) అనే లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను తాజాగా సస్పెండ్ చేసింది. ఒక ఉద్యోగికి గ్రీన్ కార్డ్ (ఈబీ-2 లేదా ఈబీ-3 కేటగిరీ కింద శాశ్వత నివాసం) ఇప్పించడానికి కంపెనీలు మొదట కార్మిక శాఖ నుంచి ఈ సర్టిఫికెట్ పొందాలి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల కోసం కొత్తగా గ్రీన్ కార్డ్ ప్రక్రియను ప్రారంభించలేవు,  ప్రస్తుతం పెండింగ్‌‌ దరఖాస్తుల ప్రాసెసింగ్ తాత్కాలికంగా ఆగిపోతుంది.