
- ముఖ్య నేతలతో ఇప్పటికే చర్చించిన బీఆర్ఎస్ చీఫ్
- కేటీఆర్‌కే బాధ్యతలు అప్పగించాలనే యోచన!
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎవరవుతారు? ఈ పదవిని పార్టీ చీఫ్ కేసీఆర్ తీసుకుంటారా? లేక కేటీఆర్, హరీశ్‌రావులలో ఒకరికి అప్పగిస్తారా? అనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతున్నది. సోమవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తర్వాత సాయంత్రం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితులపై ఈ సందర్భంగా కేసీఆర్ వారితో చర్చించారు. ఒకే రోజు ఈ పరిణామాలన్నీ జరగడంతో బీఆర్ఎస్ఎల్పీ నేత ఎవరు అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నది. 39 సీట్లతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్‌హోదా ఇస్తారు. మరి వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కూర్చుంటారా? లేదా? అనే దానిపై చర్చ సాగుతున్నది.
2009లో ఈటల.. మరి ఇప్పుడు?
బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం త్వరలోనే తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్న కేటీఆర్‌నే బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నుకుంటారని తెలుస్తున్నది. పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నంటి ఉన్న హరీశ్‌రావుకూ చాన్స్దక్కొచ్చని పార్టీలో చర్చ సాగుతున్నది. 2009లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా బీసీ నాయకుడు ఈటల రాజేందర్‌కు అవకాశం ఇచ్చారు. ఈసారి అలాంటి సంప్రదాయం ఏమైనా పాటిస్తారా? అనే దానిపైనా ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ్యూచర్ లీడర్‌గా కేటీఆర్ఇప్పటికే ప్రొజెక్ట్ అయ్యారని, ఆయనకే శాసనసభ పక్షనేత పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయని కొందరు నాయకులు చెప్తున్నారు. దీనిపై పార్టీ ముఖ్య నేతల్లోనూ ఏకాభిప్రాయం ఉందని సమాచారం. అసెంబ్లీలో అధికార పక్షం కాంగ్రెస్‌ను దీటుగా కౌంటర్ చేయాలంటే కేటీఆర్, హరీశ్‌రావు సమన్వయంతో పని చేయాలనే యోచనలో కేసీఆర్ఉన్నట్టుగా తెలుస్తున్నది. తాను రోజూ వచ్చి అసెంబ్లీలో కూర్చొని చర్చల్లో పాల్గొనడం కన్నా.. కేటీఆర్‌కే ఆ బాధ్యత అప్పగించాలనే ఆలోచనకు కేసీఆర్ వచ్చారని సమాచారం. పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే బీఆర్ఎస్ ఎల్పీ నేత ఎంపికపై ఆయన చర్చించినట్టుగా తెలుస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి.. శాసన సభ పక్షనేతను ఎన్నుకోనున్నారు.