
- కేంద్రమే 15 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న మంత్రి
- కేంద్ర ఉద్యోగాల భర్తీపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం/సూర్యాపేట, వెలుగు: ఉద్యోగాలు భర్తీ చేయాలని హైదరాబాద్ గల్లీల్లో మిలియన్ మార్చ్చేపట్టడం కాదు.. ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేపట్టాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కి మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వమే 15 లక్షల 62 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న బీజేపీ సర్కార్... ఏడున్నరేండ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి హరీశ్ రావు పర్యటించారు. పాల్వంచలో నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో నిరుద్యోగం 7.91 శాతముంటే, తెలంగాణలో 2.2 శాతం ఉంది. ఆర్మీలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి” అని హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ హయాంలో 1,32,899 ఉద్యోగాలిచ్చామని చెప్పారు. మరో 50 వేల నుంచి 60 వేల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు.
ఏడేండ్లలో ఏమివ్వలే...
317 జీవోను బీజేపీ గుడ్డిగా వ్యతిరేకిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘317 జీవో అమలైతే జిల్లాల్లోని ఖాళీ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే వస్తాయని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాలు రావడం బీజేపీకి ఇష్టం లేదా?’’ అని ప్రశ్నించారు. కేంద్రం ఏడేండ్లలో రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదన్నారు. కొత్తగా మంజూరు చేసిన ఐఐఎంలు, ఐఐఐటీలు, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలల్లో ఒక్కటన్నా రాష్ట్రానికి ఇవ్వ
లేదని మండిపడ్డారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు.
సూర్యాపేట మెడికల్ కాలేజీ బిల్డింగ్.. 3 నెలల్లో పూర్తి
సూర్యాపేట మెడికల్ కాలేజీ బిల్డింగ్ మరో 3 నెలల్లో పూర్తవుతుందని, త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని హరీశ్ రావు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం పీజీలో 25 పీజీ సీట్లు పెంచుతామని తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా ఆస్పత్రిలో 20 బెడ్స్ తో ఏర్పాటు చేసిన నవజాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. నల్గొండ, సూర్యాపేట ఆస్పత్రులను 1,800 బెడ్స్ కు అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. ఈ రెండు ఆస్పత్రుల్లో 5 డయాలసిస్ మిషన్లను వారంలో ఏర్పాటు చేస్తామని, 24 గంటలూ సేవలు అందిస్తామని తెలిపారు.