బీసీలకు కాంగ్రెస్ మోసం చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వేదికగా కొట్లాడాలి: హరీశ్రావు

బీసీలకు కాంగ్రెస్ మోసం చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వేదికగా కొట్లాడాలి: హరీశ్రావు

హైదరాబాద్, వెలుగు: బీసీలను కాంగ్రెస్​ పార్టీ మోసం చేసిందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. ‘‘ఆరు గ్యారంటీల్లాగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్​ డ్రామాలే ఆడింది. 55 ఏండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటుపడిందా? రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే జాతీయ నాయకులతో ఢిల్లీ వేదికగా కొట్లాడాలి. బీఆర్​ఎస్​ తరఫున మేం కలిసి వస్తం” అని ఆయన గురువారం ట్వీట్​ చేశారు. ‘‘మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని కుట్రలు చేసింది. ఆ కుట్రలు పటాపంచలయ్యాయి. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్​ రెడ్డి.. గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారు తప్ప బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ధి ప్రదర్శించలేదు” అని దుయ్యబట్టారు. బీసీల పట్ల నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి నాటకాలాడారని ఆరోపించారు.