
పెద్దనోట్లు రద్దు అట్టర్ ప్లాప్ షో అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇదోక విఫల ప్రయోగమన్నారు. దీని వల్ల దేశానికి రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. అందుకే బీజేపీ నేతలు మాట్లాడటం లేదన్నారు. పెద్దనోట్లు రద్దు వల్ల దేశం మొత్తం ఆగమైపోయిందని తెలిపారు. డిమానిటైజేషన్ వల్ల ప్రధాని మోడీ స్నేహితులే లాభపడ్డారని తప్ప సామన్య ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. పెద్దనోట్ల రద్దుపై కేంద్రం ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రం చెప్పిన డీమానిటైజేషన్ లక్ష్యాలు ఒక్కటి కూడా నెరవేరలేదని, ప్రధాని చెప్పిన 5 ట్రిలియన్ ఎకానమీ ఒక జోక్ అని హరీష్ విమర్శించారు. పెద్ద నోట్ల మార్పు కోసం క్యూలైన్‌లో నిలబడి 108 మంది చనిపోయారని... పెద్ద నోట్ల రద్దు వల్ల 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. మోడీ వచ్చాక దేశంలో అవినీతి పెరిగిందన్నారు. నోట్ల రద్దు వలన డ్రగ్స్ వాడకం, ఉగ్రవాదం పెరిగాయన్నారు. కేంద్రం చెప్పేదొకటి చేసేది మరొకటి అని హరీష్ విమర్శించారు. అప్పులు తేవడం, తప్పులు చేయడమే బీజేపీ విధానమని, కేంద్రం నెలకు లక్ష కోట్ల అప్పు చేస్తుందని హరీష్ ఆరోపించారు.