పంప్ హౌస్లను ఆన్ చేయండి వారం టైమ్ ఇస్తున్నం: హరీష్ రావు

పంప్ హౌస్లను ఆన్ చేయండి వారం టైమ్ ఇస్తున్నం: హరీష్ రావు

 

  • లేదంటే లక్షల మంది రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తాం: హరీశ్
  • మేడిగడ్డ నుంచి నీళ్లు వృథాగా పోతున్నయ్​
     

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర, కర్నాటకలో వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా, గోదావరి నదులకు మేలోనే వరదలు వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్​డ్యాములు నింపాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి దిగువకు 73,600 క్యూసెక్కుల నీళ్లు వెళ్తున్నాయని, కన్నెపల్లి పంప్​హౌస్​ మోటార్లను ఆన్​చేసి నీటిని తీసుకెళ్లొచ్చని చెప్పారు. ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి పంపులనూ ప్రభుత్వం నడపడం లేదన్నారు. 

36 రోజులుగా కల్వకుర్తి పంపులు బంద్ ఉన్నయని విమర్శ

వారం రోజులు ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నామని, పంపులను నడపాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షల మంది రైతులతో పంప్​హౌస్​ల వద్దకు వెళ్లి తామే మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ భవన్​లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నీళ్ల విలువ తెల్వని లీడర్లు పాలకులుగా ఉండడంతో రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. వరదొచ్చి నెల రోజులవుతున్నా మోటార్లను ప్రారంభించలేదు. కండ్ల ముందు నీళ్లు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరు క్రిమినల్​ నెగ్లిజెన్సీ కిందకు వస్తుంది’’అని హరీశ్ మండిపడ్డారు.

కాళేశ్వరం.. అక్షయపాత్ర లాంటిది

కాళేశ్వరం అక్షయపాత్ర లాంటిదని, దాన్ని తక్కువ చేసి చూపించొద్దని హరీశ్ రావు అన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి.. అదే పాలమూరు రైతుల కడుపు కొడుతున్నారని విమర్శించారు. ‘‘శ్రీశైలానికి మే 30న వరద వచ్చింది. 36 రోజులవుతున్నా కల్వకుర్తి మోటార్లను ఆన్ చేయలేదు. పోయినసారిలాగా మళ్లీ కృష్ణా నీళ్లను చంద్రబాబుకు వదిలేస్తారా? రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణాలో అతి తక్కువ నీళ్లను వాడుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. 65 టీఎంసీలను చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించారు’’అని హరీశ్ అన్నారు.