హరీష్ రావుకు మళ్లీ అగ్గిపెట్టె దొరకలేదు

హరీష్ రావుకు మళ్లీ అగ్గిపెట్టె దొరకలేదు

కరీంనగర్: హుజూరాబాద్ లో మంత్రి హరీష్ రావు కు మళ్లీ అగ్గిపెట్టె దొరకలేదు. లైటర్ తో జ్యోతి ప్రజ్వలన చేసినా దీపం వెలగలేదు. దీంతో అగ్గిపెట్టె తెచ్చే వరకు ఆగి.. అగ్గిపెట్టె వచ్చిన తర్వాతే జ్యోతి ప్రజ్వలన గావించిన గురువారం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని ఋణాలు బ్యాంక్ లింకేజీ , స్త్రీ నిధి రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన సమయంలో అగ్గిపెట్టే లేకపోవడంతో లైటర్ తో జ్యోతి వెలిగించేందుకు మంత్రి హరీష్ రావు ప్రయత్నించారు. అయితే అంటుకోకపోవడంతో ఆగిపోయారు. నిర్వాహకులు అగ్గిపెట్టే తెచ్చేంత వరకు ఆగిన మంత్రి..  చివరికి అగ్గిపెట్టె తెచ్చాక జ్యోతిని వెలిగించారు.
మంత్రి హరీష్ రావుకు తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలులో నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేస్తానని చెప్పి... అగ్గిపెట్టె తెచ్చుకోకుండా ఉత్తుత్తి బెదిరింపులకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు తరచూ విమర్శలు.. సెటైర్లు విసురుతుంటారు. ఈ నేపధ్యంలో యాదృచ్చికమో... కాకతాళీయమో గాని.. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో జ్యోతి వెలిగించి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రి హరీష్ రావుకు అగ్గిపెట్టె దొరకలేదు. దాని కోసం వేచి చూసి వచ్చిన తర్వాతే వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో సభలో పలువురు గతాన్ని.. ప్రతిపక్షాల విమర్శలను గుర్తు చేసుకుని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు.