సిద్దిపేట, వెలుగు: ఓట్ల కోసమే సర్కారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. మంగళవారం కలెక్టర్ ఆఫీసులో నియోజక వర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రతీ బతుకమ్మ పండుగకు 18 ఏండ్లు నిండిన కోటి 30వేల మహిళలకు చీరెలు అందిస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న 46 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తూ పట్టణాల్లో మాత్రం పంపిణీ చేయడం లేదని దుయ్యబట్టారు.
పట్టణాల్లో ఎన్నికలు లేవని చీరలు లేవు వడ్డీ లేని రుణాలు లేవన్నారు. మహిళ సంఘాలు రూ.25వేల కోట్ల రుణాలు తీసుకుంటే రూ.5వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం 20పైసలు ఇస్తూ 80పైసలు ఎగవేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సు ఇవ్వలేదని, సోలార్ పవర్ ప్లాంట్ ఇస్తామని చెప్పి నేటికీ రెండేళ్లయిందని విమర్శించారు. అనంతరం నియోజక వర్గంలోని 3129 మహిళా సంఘాలకు కలెక్టర్హైమావతితో కలిసి 3.61 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు.
రైల్వే గోదాంల కోసం భూసేకరణ జరపాలి
సిద్దిపేట జిల్లాలో రైల్వే శాఖ ద్వారా నిర్మించే గోడౌన్ల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని హరీశ్ రావు కలెక్టర్ ను కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ హైమవతితో పాటు, రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సనత్ నగర్, చర్ల పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఉండే గోడౌన్ల మాదిరిగా సిద్దిపేట గౌడౌన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
జిల్లాలో రైల్వే లైన్ ను అనుకోని ఉన్న అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించి పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు నవ్యశ్రీ, విద్యాధర్, మూర్తి, జనర్దన్ పాల్గొన్నారు.
