
- అందుకే కాళేశ్వరానికి రిపేర్లు చేయట్లే: హరీశ్ రావు
- నీళ్లిస్తే కేసీఆర్ చరిత్రలో నిలుస్తారని కక్ష కట్టారని ఫైర్
- రిటైర్డ్ ఇంజనీర్ దేశ్‌పాండే రచించిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు: వాస్తవాలు, వక్రీకరణల పుస్తకం’ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేసి నీళ్లిస్తే కేసీఆర్ చరిత్రలో నిలుస్తారన్న రాజకీయ కక్షతో రైతులు, రాష్ట్ర ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి బలిచేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తాగునీటి పరిస్థితిపై వందేండ్లు ముందుకు ఆలోచించి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్ శ్రీధర్ దేశ్‌పాండే రచించిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు: ప్రశ్నలు, విమర్శలు, వక్రీకరణలు, వివరణలు’ అనే పుస్తకాన్ని శుక్రవారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో హరీశ్‌రావు, నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. కాంట్రాక్టర్ల కోసం, కమీషన్ల కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించడం దారుణమన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్.. అప్పటి మహారాష్ట్ర సీఎంతో సమావేశమై ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు. వాస్తవానికి తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత లేదని 2005లో సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలింది. ఎగువ రాష్ట్రాలకు 63 టీఎంసీలు పోను.. దిగువ రాష్ట్రాలకు 102 టీఎంసీలే ఉంటాయని చెప్పింది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ వద్ద వ్యాప్కోస్ సంస్థ ద్వారా సర్వే చేయిస్తే 240 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు తేలింది. అందుకే ఆ ప్రాజెక్టును చేపట్టారు” అని హరీశ్ పేర్కొన్నారు.
కృష్ణా ట్రిబ్యునల్‌లో సెక్షన్3పై వాదనలు వినడం కేసీఆర్ సాధించిన విజయమన్నారు. అలాగే, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ తాగు, సాగు అవసరాల కోసం మల్లన్నసాగర్‌ను కేసీఆర్ నిర్మించారని అన్నారు. ‘‘కాళేశ్వరం కూలిందని చెబుతూనే.. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటి తరలింపుకు రేవంత్ సర్కారు టెండర్లు పిలిచింది. కేసీఆర్ దూరదృష్టితో మల్లన్నసాగర్‌ను కట్టారు కాబట్టే.. హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి 20 టీఎంసీల నీటిని తేగలుగుతున్నారు’’ అని హరీశ్ చెప్పారు. మరోవైపు కృష్ణా నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దోచుకెళ్తున్నారని, ఇప్పుడు గోదావరి నీళ్లను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. 150 టీఎంసీలతో బొల్లాపల్లి రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నదని పేర్కొన్నారు.