- 22ఏ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: సామాన్యుల ఇండ్లను సైతం 22ఏ జాబితాలో పెట్టి అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ అనుమతులున్న వేలాది ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం ఏకపక్షంగా 22ఏ జాబితాలో పెట్టిందని ఆరోపించారు.
నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను 22ఏలో పెట్టారని నాలుగు నెలల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి.. రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని యజమానులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.
రెవెన్యూ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా సీఎం చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైనా రిటైర్డ్ హైకోర్టు జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 30 శాతం కమీషన్లు, 50:50 అగ్రిమెంట్ల వెనుక ఉన్న పెద్దలు ఎవరు..? దళారులు, బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరన్నది విచారణలో నిగ్గు తేల్చాలన్నారు. జిల్లాల వారీగా 22ఏ జాబితాను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలన్నారు.
