పంచాయతీ పోరులో కాంగ్రెస్ బేజారు : మాజీ మంత్రి హరీశ్‌రావు

పంచాయతీ పోరులో కాంగ్రెస్ బేజారు : మాజీ మంత్రి హరీశ్‌రావు
  • ఓటమి భయంతోనే జెడ్పీటీసీ, మున్సిపల్, డీసీసీబీ ఎన్నికలు వాయిదా  
  • రెండేండ్ల తర్వాత అధికారంలోకి బీఆర్ఎస్
  • బీఆర్ఎస్ సర్పంచ్ ల సన్మాన సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కారు జోరు.. కాంగ్రెస్ బేజారు అయినట్టు కనిపిస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ దౌర్జన్యాలను తట్టుకొని బీఆర్ఎస్ 40 శాతం అంటే 4 వేలకుపైగా సర్పంచ్  లను గెలుచుకొని సత్తా చాటిందని చెప్పారు.  బీఆర్ఎస్‌ పక్షాన గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను అభినందిస్తూ శనివారం సంగారెడ్డి, అందోల్‌ సెగ్మెంట్ల పరిధిలో సన్మానసభ నిర్వహించగా, అందులో పాల్గొని  హరీశ్‌రావు మాట్లాడారు. 

పంచాయతీ ఫలితాలు చూస్తుంటే మళ్లీ బీఆర్ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ లెక్కన కాంగ్రెస్ రాష్ట్రంలో 10 – 12 ఎమ్మెల్యే స్థానాలకు మించి గెలవదన్నారు. అబద్ధాలు ఆడడంలో రేవంత్‌రెడ్డికి నోబుల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.  మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోతామనే  భయంతోనే రేవంత్ రెడ్డి ఎన్నికలు పెట్టడం లేదని విమర్శించారు.  సీఎం, ఎమ్మెల్యేలకు లేని చెక్‌ పవర్‌ సర్పంచ్‌కు ఉంటుందని, అందుకే ధైర్యంగా పని చేయాలని, కొట్లాడి నిధులు తెచ్చుకుందామని సూచించారు.

 త్వరలో సర్పంచ్ విధివిధానాలు, బాధ్యతలపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతామని పేర్కొన్నారు.  ఈ సభలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నరహరిరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు కొండల్ రెడ్డి, మనోహర్ గౌడ్, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీహరి, పార్టీ నేతలు పాల్గొన్నారు.