అప్పుడు రిజర్వాయర్లు నిండుగా ఉండె.. ఇప్పుడు ఎండిపోయినయ్: హరీశ్ రావు

అప్పుడు రిజర్వాయర్లు నిండుగా ఉండె.. ఇప్పుడు ఎండిపోయినయ్: హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం మెదక్ పార్లమెంట్​ఎన్నికల్లో గెలుపు  కోసం చిన్నకోడూరులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో రైతులకు 6 గంటల కరెంట్ ఇస్తే తమ హయాంలో రూ.90 వేల కోట్లు ఖర్చు చేసి 24 గంటలు ఇచ్చామన్నారు. అప్పుడు నిండుగా చూసిన జలాశయాలు ఇప్పుడు ఎండిపోతే చూస్తున్నామన్నారు. నాడు గడ్డిని కూడా ఆంధ్రా నుంచి తెచ్చి పశువులను కాపాడుకున్నామని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని, తమకు మెజారిటీ ఎంపీ సీట్లు ఇస్తే కాంగ్రెస్ హామీల గురించి నిలదీస్తామన్నారు.

 బీజేపీ అభ్యర్థి ప్రజలకు నష్టం చేశారని, ఉప ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. దుబ్బాకలో చెల్లని వ్యక్తి ఇక్కడ ఎలా చెల్లుతాడని ప్రశ్నించారు. ఎన్నడూ జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి.. నేడు సీఎం అయ్యాడని, అప్పట్లో జై తెలంగాణ అనే వాళ్లను కాల్చి పడేస్తా అన్నాడని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే కలెక్టర్​గా  పని చేశానో అక్కడి నుంచే పార్లమెంట్ కు వెళ్లే అవకాశం రావడం తన అదృష్టమన్నారు.