
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్ అసభ్యకరంగా దూషిస్తున్నారని హరీశ్ పేర్కొన్నారు. గతంలో బీజేపీ నేతలు రాహుల్‌గాంధీని తిడితే, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసిందని, ఇప్పుడు అదే విధంగా రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ను తిడుతుంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, ఆయనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ను రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సమర్థిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన రైతులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఓ ప్రకటనలో హరీశ్‌రావు ఖండించారు. రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతన్నలను అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. అరెస్టులు చేసిన రైతులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.