రైతులకే పన్ను కడుతున్న ఏకైక సీఎం కేసీఆర్

రైతులకే పన్ను కడుతున్న ఏకైక సీఎం కేసీఆర్
  • రోడ్డు పనుల ప్రారంభంలో మంత్రి హరీశ్ రావు

 
సిద్దిపేట, వెలుగు: రాజీవ్ రహదారి అవతల నిర్మిస్తున్న రింగ్ రోడ్డు సిద్దిపేటకే మణిహారంలా మారనుందని మంత్రి హరీశ్​రావు అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు మండల కేంద్రంలో, నంగునూరు మండలం పాలమాకుల వద్ద సిద్దిపేట రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఇకపై  సిద్దిపేట టౌన్ రావాల్సిన పని లేకుండా చేస్తున్నామన్నారు. 88 కిలో మీటర్ల మేర రూ.160కోట్లతో ఈ రింగ్ రోడ్డు  నిర్మిస్తున్నట్టు తెలిపారు. రింగ్​రోడ్డుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

రైతులకే పన్ను కడుతున్న ఏకైక సీఎం కేసీఆర్..
-దేశంలోని అన్నీ ప్రభుత్వాలు రైతుల నుంచి  శిస్తు వసూలు చేస్తుంటే, రైతులకే పన్ను కడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఎంత కష్టంగా ఉన్నా సమయానికి  రైతుల కోసం రైతుబంధు డబ్బులు వేయిస్తున్నారని మంత్రి  అన్నారు.  రైతుబంధు డబ్బులు అకౌంట్లలో పడుతుంటే రైతుల ముఖాల్లో ఆనందం కనబడుతోందన్నారు. నీటి తీరువాను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రైతుల నుంచి  ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వం మీటర్లు పెట్టమని రైతుల మెడకు ఉరితాడు పెడుతోందని ఆరోపించారు. ఏపీ బాయికాడ మీటర్లు పెట్టి 4 శాతం ఎఫ్ఆర్ బీఎం నిధులు తెచ్చుకున్నదని, కానీ తెలంగాణ రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎఫ్ఆర్బీఎం  కింద రాష్ట్రానికి  వచ్చే రూ.25 వేల కోట్లు వద్దనుకున్నారని గుర్తు చేశారు. 

పలు అభివృద్ధి పనులు ప్రారంభం
చిన్నకోడూరు, నంగునూరు మండలంలోని పలు  గ్రామాల్లో అభివృద్ధి పనులను మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. అనంతసాగర్ గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన యాదవ సంఘం భవనాన్ని , 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్​ను, చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్​ను గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ తో కలిసి ఆయన ఓపెన్​చేశారు. సికిందలపూర్ గ్రామంలో మనఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా జడ్పీ హైస్కూలులో వంట గది నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. పల్లెప్రకృతి వనం ప్రారంభించి అక్కడి ఉపాధి కూలీలతో పనిదినాలు, వానాకాలం పంటసాగుపై ముచ్చటించారు. అనంతరం జడ్పీ హైస్కూలు ఆవరణలో క్రీడా ప్రాంగణం, మల్లారం గ్రామంలో బాలవికాస మంచినీటి ప్లాంట్, అనంతరం పల్లె ప్రకృతి వనం, రైతువేదికలను, మేడిపల్లి గ్రామంలో ఎలక్ట్రికల్ సెక్షన్ ఆఫీస్​ను ప్రారంభించారు. ఆ తర్వాత నంగునూరు మండలం గట్లమల్యాలలో బీటీ రోడ్డు పనులను, గట్లమల్యాల నుంచి నాగసముద్రాల రోడ్డు మరమ్మతు, గట్ల మల్యాల నుంచి కరీంనగర్ జిల్లా సరిహద్దు వరకు బీటీ రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. గట్లమల్యాలలో రూ.10 లక్షలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను సీతారాంపల్లిలో బస్ షెల్టర్,  పీడబ్ల్యూడీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు.

‘డబుల్’ గృహ ప్రవేశాలు.. 
నంగునూరు మండలం గట్లమల్యాల గంగిరెద్దుల కాలనీలో 24 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, బద్ధిపడగ వడ్డెరకాలనీలో 50 డబుల్  బెడ్ రూమ్ గృహ ప్రవేశాల కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. మిగిలిపోయిన పేదలకు ఇంటి జాగలు ఉంటే అందులో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులను త్వరలోనే మంజూరు చేస్తామని హామీనిచ్చారు. అంతకుముందు మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నకోడూర్ మండలం అల్లీపూర్-50, చర్ల అంకిరెడ్డిపల్లి-20, ఎల్లాయపల్లి-26, సిద్దిపేట రూరల్ మండలంలోని వెంకటాపూర్ కు చెందిన ఏడుగురికి - డబుల్ బెడ్ రూమ్  ఇండ్ల ధ్రువీకరణ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ  పాల్గొన్నారు. 

‘టెట్’ అభ్యర్థులకు శుభాకాంక్షలు
సిద్దిపేట రూరల్, వెలుగు : టెట్ ఫలితాల్లో కేసీఆర్‌‌ కోచింగ్‌‌ సెంటర్‌‌ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 84శాతం ఉత్తీర్ణత సాధిండంతో వారిని మంత్రి హరీశ్ రావు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కోచింగ్ సెంటర్ ద్వారా 617 మంది కోచింగ్ తీసుకొని, పరీక్ష రాయగా 518 మంది అభ్యర్ధులు టెట్‌‌ పేపర్‌‌- 1, పేపర్‌‌- 2లో అర్హత సాధించారు.