సీఎం కేసీఆర్​ తొమ్మిదేండ్ల కృషి : మంత్రి హరీశ్ రావు

సీఎం కేసీఆర్​ తొమ్మిదేండ్ల కృషి : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లు తిప్పలు పడి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని మంత్రి హరీశ్​రావు అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులో మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్ హయాంలో ఎరువుల  బస్తా కోసం చెప్పులను క్యు లైన్‌లో పెట్టేవారని

ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు నాలుకకు నరం లేనట్లు మాట్లాడుతున్నారని, మళ్లీ వాళ్లకు అధికారం ఇస్తే కష్టాల పాలవుతామన్నారు. బీజేపీ గ్యాస్ ధరను అడ్డగోలుగా పెంచిందని, దాన్ని తగ్గించే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. ఏ పథకం అయినా మహిళ పేరిట ఇస్తే సద్వినియోగం అవుతుందనీ కేసీఆర్ మహిళల పేరిట పథకాలు తెచ్చారని కొనియాడారు. నియోజకవర్గ సరిహద్దు వరకు

 ఫోర్ లేన్ రహదారి 

సిద్ధిపేట నియోజకవర్గ సరిహద్దు వరకూ ఫోర్ లేన్ రహదారిని వేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట నుంచి మెదక్ రోడ్ లో తిమ్మాపూర్ గ్రామం వరకూ ఉన్న తొర్నాల, ఇర్కోడ్, బూర్గుపల్లి గ్రామాల మీదుగా నాలుగు లేన్ల రహదారి, డివైడర్

రెండువైపులా వెలుగులు విరజిమ్మేలా వీధి దీపాలు వస్తున్నాయని తెలిపారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పంపిణీ చేసి, పట్టణంలోని బీజేఆర్ సర్కిల్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ భవనం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిఎంపీపీ శ్రీదేవి  , వైస్ ఎంపీపీ శేరుపల్లి యాదగిరి, జడ్పీటీసీ శ్రీహరి గౌడ్, సర్పంచ్ లు పాల్గొన్నారు.