హరీష్ రావు ప్రజా నాయకుడు.. కానీ ఆయన్ని కూడా అవమానించారు

హరీష్ రావు ప్రజా నాయకుడు.. కానీ ఆయన్ని కూడా అవమానించారు

బీజేపీలో చేరే ఉద్దేశం లేదని నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పైనా మురళీ యాదవ్ పలు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు, బీసీలకు సముచిత స్థానం లేదన్నారు. ఇతర పార్టీల్లో ఓడిపోయి... టీఆర్ఎస్ లోకి వస్తే పదవులు ఇచ్చారు గానీ లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు ఇవ్వడం లేదని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలను కేసీఆర్ అవమానిస్తున్నారన్న ఆయన.. తన భార్య జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా జెడ్పీ సమావేశానికి సీఎం రాలేదన్నారు. గతంలో జెడ్పీ సమావేశానికి ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ వచ్చారు గానీ.. కేసీఆర్ రాలేదని ఆరోపించారు.

 రాష్ట్రంలో అభివృద్ధి అంతా గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గంలకే పరిమితం అయిందన్న మురళీ యాదవ్.. హరీష్ రావు ప్రజా నాయకుడు.. కానీ ఆయన్ని కూడా కేసీఆర్ అవమానించారని విమర్శించారు. సీఎం నియోజకవర్గంలో ఒక్క బీసీకి అయినా నామినేటెడ్ పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. రెండోసారి తన భార్యకు జెడ్పీ ఛైర్మన్ పదవి రాకుండా సీఎం అడ్డుకున్నారన్నారు. ఈ విషయంలో పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను మాత్రం భయపడేది లేదన్న ఆయన.. బీజేపీలో చేరే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.