
ఓడినోళ్లకు ఓదార్పు కేసీఆర్..తండ్రిని కలుసుకున్న కవిత.. 9 నెలల తర్వాత ప్రగతి భవన్‌కు హరీశ్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నాలుగు నెలల్లోనే పార్టీ పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు పెరిగిందన్న దానిపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం మొదలుపెట్టింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు గులాబీ నేతలు దీనిపై లెక్కలేసుకున్నారు. బీజేపీ రాష్ట్రంలో నాలుగు సీట్లు సాధించడాన్ని పార్టీ అధినేత కేసీఆర్, పార్టీలోని కీలక నేతలు జీర్ణించుకోలేపోతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యులు గెలవడంపైనా కారణాలను అన్వేషిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత తొలిసారిగా ప్రగతి భవన్‌లో మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అడుగుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి, బీజేపీ, కాంగ్రెస్‌ల గెలుపుపై సీఎంతో చర్చించినట్టుగా తెలిసింది.
ఉన్న సీట్లలోనే కోత పడిందేంటి?
గురువారం పార్లమెంట్ ఓట్ల లెక్కింపు మొదలైన రెండు గంటల్లోనే టీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన కనిపించింది. భువనగిరి, మల్కాజ్‌గిరి, చేవెళ్ల సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వడం ఈ ఆందోళనను మరింత పెంచింది. కరీంనగర్, నిజామాబాద్ ట్రెండ్స్‌తో పార్టీ కీలక నేతలు డీలా పడ్డారు. తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయలేదు. సీఎం కుమార్తె కవిత, అత్యంత సన్నిహితుడు, ఢిల్లీలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టే బి.వినోద్‌కుమార్ ఓటమి సీఎంను కుంగదీసినట్టు తెలిసింది. 16 ఎంపీ సీట్లను గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తే ఉన్న 11 సీట్లలో రెండింటిని కోల్పోవడానికి కారణాలను వెదుకుతున్నారు. గురువారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫలితాలపై సమీక్ష జరిపారు.
మెజార్టీలు ఎట్ల తగ్గినై?
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్లు, పార్లమెంట్‌లో పోలైన ఓట్లతో సరిపోల్చుతూ ఎక్కడెక్కడ పార్టీకి నష్టం కలిగిందన్నదానిపై శుక్రవారం ఉదయాన్నే సీఎం, నేతలు లెక్కలేశారు. గెలిచిన సీట్లలో నాగర్‌కర్నూల్‌లో తప్ప మిగతా చోట్ల మెజార్టీలు దారుణంగా తగ్గాయంటూ సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నాలుగు సీట్లలో బీజేపీ మంచి మెజార్టీతో గెలవడంపైనా సమీక్షించారు. బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడివి, ఆ పార్టీ వైపు ఓటర్లు మారుతుంటే అలర్ట్ చేయకుండా ఏం చేశారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలను ప్రశ్నించినట్టు సమాచారం.
ఎలా చెక్ పెడదాం.. చెప్పండి
కాంగ్రెస్ ఎంపీలుగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలవడం టీఆర్‌ఎస్ ముఖ్యులకు మింగుడు పడటం లేదు. టీఆర్‌ఎస్‌పై ఇంతెత్తున లేచే ఈ ఇద్దరు నేతలతో మున్ముందు ఢిల్లీలో తలనొప్పులు ఎదురవుతాయని చర్చించినట్టుగా తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ బలం పెంచుకోవడం భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌కు ముప్పుగా పరిణమిస్తుందని, ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో చెప్పాలని సీఎం కేసీఆర్ పలువురు నేతలను అడిగినట్టుగా తెలిసింది. ఫిరాయింపులపై నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందా? రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్న దానిపైనా ఆరా తీసినట్టుగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది టీఆర్‌ఎస్ పార్టీ వాళ్లే పోటీ చేయడం వల్ల ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయా అని కూడా ఆరా తీశారు. ఎన్నికల్లో ఓడిపోయిన కవిత, వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్‌ను హరీశ్‌రావు వారి నివాసంలో కలిసి పరామర్శించారు. తర్వాత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు ప్రగతి భవన్ వెళ్లి సీఎంతో
సమావేశమయ్యారు.
కేసీఆర్‌ను కలిసిన కొత్త ఎంపీలు
కొత్త ఎంపీలు పోతుగంటి రాములు (నాగర్‌కర్నూల్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), పసునూరి దయాకర్ (వరంగల్), మాలోత్ కవిత (మహబూబాబాద్), నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్), బీబీ పాటిల్ (జహీరాబాద్), జి.రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), బి.వెంకటేశ్ (పెద్దపల్లి) ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. సీఎం వారిని అభినందించారు.
హరీశ్… ఎన్నాళ్లకెన్నాళ్లకు?
హరీశ్‌రావు 9 నెల్ల తర్వాత ప్రగతి భవన్‌లో అడుగుపెట్టారు. గత ప్రభుత్వంలో మంత్రిగా 2018 సెప్టెంబర్ 6న మంత్రివర్గ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రగతి భవన్ గడప తొక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఎర్రవల్లిలో ఒకట్రెండు సార్లు కేసీఆర్‌తో హరీశ్ భేటీ అయ్యారు. రెండో విడత కేసీఆర్ సీఎం అయ్యాక ఎర్రవల్లిలో నిర్వహించిన రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. మొదట టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోనూ హరీశ్ పేరు చేర్చలేదు. దీనిపై మీడియాలో చర్చ జరిగాక జాబితాలో చేర్చినా మెదక్‌కే పరిమితం చేశారు.