హామీలపై చేతులెత్తేయడం కాంగ్రెస్కు అలవాటే : హరీష్ రావు

 హామీలపై  చేతులెత్తేయడం కాంగ్రెస్కు అలవాటే  :  హరీష్ రావు

ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీలను ఇవ్వడం, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ విషయం చరిత్రలో ఎన్నోసార్లు రుజువు అయిందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి  హరీష్ రావు లేఖ రాశారు.  ఈ లేఖలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను,  బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆంశాలను హరీష్ ప్రస్తావించారు.

మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పిన నీతులకు, అధికారంలో ఉండి చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతన లేదన్నారు హరీష్ రావు.  దీంతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు ఏ మాత్రం విలువ లేదని తేటతెల్లమైపోయిందన్నారు. అయినా సరే, లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి తెలంగాణకు రావడం అత్యంత దురదృష్టకరమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. 

ప్రజలను ఎన్నిసార్లైనా సరే మోసం చేసి గెలవవచ్చు అనే మీ మొండి ధైర్యానికి నిజంగా ఆశ్చర్యం కలుగుతున్నదని హరీష్ ఎద్దేవా చేశారు.  గతంలో ఇచ్చిన హామీలు అన్నిటినీ విస్మరించి, మళ్లీ కొత్తగా హామీలు ఇవ్వడం, మళ్లీ ప్రజలను ఓట్లడగడం నీతి మాలిన పని అని అన్నారు హరీష్ రావు.  తెలంగాణ ప్రజలను మళ్లీమళ్లీ మోసం చేయాలనుకునే మీ ఎత్తుగడలు ఇక ముందు సాగబోవు అని లేఖలో తెలిపారు.