మెదక్‌‌ బరిలో హరీశ్‌‌ లేదంటే కేసీఆర్..!

మెదక్‌‌ బరిలో హరీశ్‌‌ లేదంటే కేసీఆర్..!
  • సిట్టింగ్​ సీటును కాపాడుకోవడంపై హైకమాండ్​ దృష్టి
  •     అధికారం కోల్పోవడంతో ఇప్పటికే కేడర్‌‌ చెల్లాచెదురు
  •     ఇతరులకు టికెట్​ఇస్తే గెలిచే అవకాశం లేదని సర్వే రిపోర్టులు
  •     కేసీఆర్​ఫ్యామిలీ నుంచే ఒకరిని బరిలో దింపాలనే ఆలోచన

మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉద్యమకాలం నుంచి బీఆర్‌‌ఎస్‌‌కు కంచుకోటలా ఉన్న మెదక్‌‌ లోక్‌‌సభ స్థానాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆ పార్టీ హైకమాండ్​ మల్లగుల్లాలు పడుతోంది.  ఈ సీటును గెల్చుకోవడం గులాబీ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో క్యాడర్​చేజారుతుండడం,  కాంగ్రెస్‌‌, బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురవుతుండడంతో బలమైన అభ్యర్థిని బరిలో దింపితే తప్ప ఈ సీటును గెలిచే పరిస్థితి లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.  ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారిలో ఆ స్థాయి లీడర్లెవరూ లేకపోవడంతో అవసరమైతే హరీశ్‌‌రావును పోటీలో నిలపాలని, లేదంటే తానే స్వయంగా బరిలో దిగాలని మాజీ సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అభ్యర్థి కోసం వెతుకులాట.. 

మెదక్‌‌ సిట్టింగ్‌‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త క్యాండిడేట్‌‌ను వెతుక్కోవడం ఆ పార్టీకి అనివార్యంగా మారింది. ఈ  టికెట్‌‌ కోసం నర్సాపూర్, మెదక్‌‌ మాజీ ఎమ్మెల్యేలు చిలుముల మదన్‌‌రెడ్డి, పద్మా దేవేందర్‌‌రెడ్డి, తదితరులు పోటీపడ్డారు. కానీ బీజేపీ నుంచి రఘునందన్​బరిలో నిలవగా, కాంగ్రెస్​నుంచి మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు లాంటి బలమైన అభ్యర్థులు రేసులో ఉన్నారు. దీంతో ఫారెస్ట్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ మాజీ చైర్మన్‌‌ వంటేరు ప్రతాప్‌‌రెడ్డి వైపు మొగ్గు బీఆర్ఎస్​హైకమాండ్​ మొగ్గు చూపింది. ఈయన పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం జరిగింది.  కానీ తాజాగా పార్టీ నిర్వహించిన సర్వే తర్వాత ప్రతాప్‌‌రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో హైకమాండ్​ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా బరిలోకి దిగితే తప్ప మెదక్‌‌లో గెలవడం దాదాపు అసాధ్యమని తేలడంతో ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

2004 నుంచి మెదక్‌‌ బీఆర్‌‌ఎస్‌‌దే...

2004 నుంచి 2019 వరకు జరిగిన నాలుగు జనరల్, ఒక బై ఎలక్షన్‌‌లో ఇక్కడ బీఆర్‌‌ఎస్‌‌ పార్టీయే విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ లోక్‌‌సభ నియోజకవర్గ పరిధిలోని 6  సెగ్మెంట్లలో బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్లే గెలిచారు. దీంతో పార్లమెంట్‌‌ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఈజీయేనని అంతా భావించారు. కానీ రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ లీడర్లను ఓటమి భయం వెంటాడుతోంది.

తెరపైకి హరీశ్‌‌ రావు, కేసీఆర్‌‌ పేర్లు

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావును మెదక్‌‌ బరిలో నిలపాలని, ఆయన అయితేనే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు విజయావకాశాలు ఉంటాయని తాజా సర్వేలో  తేలినట్లు బీఆర్ఎస్​లీడర్లు చెప్తున్నారు. కానీ పోటీకి హరీశ్‌‌రావు సముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మెదక్‌‌ సిట్టింగ్‌‌ స్థానాన్ని చేజార్చుకోవద్దని భావిస్తున్న బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌‌ స్వయంగా తానే బరిలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. హరీశ్‌‌రావు, కేసీఆర్‌‌లో ఎవరో ఒకరు పోటీలో ఉంటేనే బీఆర్‌‌ఎస్‌‌ శ్రేణులన్నీ ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో గెలుపునకు కృషి చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈక్రమంలో కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌ ప్రకటన తర్వాతే బీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థిని ఫైనల్‌‌ చేస్తారనే టాక్​ నడుస్తోంది.