టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ను సభలోకి ఎట్ల రానిస్తరు : హరీశ్ రావు

టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ను సభలోకి ఎట్ల రానిస్తరు :  హరీశ్ రావు
  • ప్రజంటేషన్‌‌‌‌‌‌‌‌కు తీసుకురావడంపై హరీశ్ అభ్యంతరం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌పై శ్వేత పత్రం పెట్టే సమయంలో టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ను లోపలికి అనుమతించడంపై సభలో వివాదం నెలకొంది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఆపరేషన్ కోసం టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ను స్పీకర్ పర్మిషన్‌‌‌‌‌‌‌‌తోనే ప్రభుత్వం హౌస్ లోపలికి తీసుకొచ్చింది. అయితే, దీనిపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే హరీశ్ రావు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అసలు ఓ టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ను హౌస్‌‌‌‌‌‌‌‌లోకి ఎట్లా అనుమతిస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. రేపు ముక్కుమొహం తెలియని వాళ్లను కూడా సభలోకి రానిస్తారా అని నిలదీశారు. హౌస్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చే అధికారం సభ్యులు, ఆ తర్వాత ఏజీకి మాత్రమే ఉంటుందని గుర్తుచేశారు. సభా సంప్రదాయాలను రాష్ట్ర సర్కార్ మంటగలుపుతున్నదని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. హరీశ్‌‌‌‌‌‌‌‌ మాటలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

గతంలో కేసీఆర్ కూడా టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ను పెట్టుకునే ప్రజంటేషన్ ఇచ్చారని, సభ్యుల విజ్ఞప్తి మేరకు తానే అతన్ని సభలోకి అనుమతించానని తెలిపారు. స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తనను ప్రశ్నించొద్దని హరీశ్‌‌‌‌‌‌‌‌కు తేల్చి చెప్పారు. హరీశ్‌‌‌‌‌‌‌‌ స్పందిస్తూ.. గతంలో కేసీఆర్ ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ను లోపలికి తీసుకురాలేదన్నారు. కొత్త వ్యక్తులకు లోపలికి వచ్చేందుకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం, ఇవ్వకపోవడం స్పీకర్​ విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. అయితే, స్పీకర్ అనుమతితోనే టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ను లోపలికి తీసుకొచ్చామని తెలిపారు.

మైక్ కట్ చేస్తున్నరు.. 

అసెంబ్లీలో కీలక అంశంపై మాట్లాడే టైం లో తన మైక్ కట్ చేస్తున్నారని, ఫేస్ చూపించకుండా కెమెరా వేరే వైపు టర్న్ చేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్​ రావు ఆరోపించారు. శనివారం కూడా గద్దర్, అందెశ్రీ పాట పాడుతుంటే కట్ చేశారని, తాను మాట్లాడే టైంలో అధికార పార్టీ వాళ్లు స్లిప్ పంపుతున్నరని ఆయన అన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ బర్త్ డే ఉందని శనివారం అసెంబ్లీ నిర్వహించారా? అని మీడియా ప్రశ్నించగా.. నల్గొండ మీటింగ్, మేడిగడ్డ టూర్ రోజు కూడా అసెంబ్లీకి వచ్చానని, బర్త్ డే అని రాకుండా ఉండలేదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారమే అసెంబ్లీ క్లోజ్ చేయమని స్పీకర్ ను కోరామని, 3 గంటల పాటు జీరో అవర్ నిర్వహించారని, 3 గంటలు బీసీ బిల్లు చర్చ ఆమోదం చేసి 2 గంటలు టీ బ్రేక్ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.