రేవంత్‌‌‌‌రెడ్డి, కిషన్‌‌‌‌రెడ్డిది ఫెవికాల్ బంధం : హరీశ్‌‌‌‌రావు

రేవంత్‌‌‌‌రెడ్డి, కిషన్‌‌‌‌రెడ్డిది ఫెవికాల్ బంధం : హరీశ్‌‌‌‌రావు
  • ఓటుకు నోటు ఇష్యూలో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేదు: హరీశ్‌‌‌‌రావు
  • ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌ చూస్తుంటే సీఎం మానసిక స్థితిపై అనుమానాలు
  • సీఎంగా ఆయన రెండేండ్లలో చేసిందేమీ లేదు
  • హైదరాబాద్‌‌‌‌పై కేసీఆర్​ ముద్రను ఎవరూ చెరపలేరని కామెంట్​

హైదరాబాద్​, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి, సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డిది ఫెవికాల్​బంధమని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేదని ప్రశ్నించారు.  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి గంటన్నరసేపు మాట్లాడిన ప్రెస్​మీట్​చూస్తే.. ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతున్నదని అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌‌‌‌లో హరీశ్‌‌‌‌రావు మీడియాతో మాట్లాడారు. 

జూబ్లీహిల్స్‌‌‌‌లో కాంగ్రెస్​ పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫలించకపోవడంతో.. ఆ ఫ్రస్ట్రేషన్‌‌‌‌లోనే రేవంత్‌‌‌‌రెడ్డి గంటన్నరసేపు అడ్డమైన చెత్త వాగారని అన్నారు. ప్రభుత్వాన్ని నడపడం  చేతకావడం లేదని సీఎం మాటల్లో తేలిపోయిందని చెప్పారు. తన అసమర్థతను చెప్పకనే చెప్పుకున్నారని విమర్శించారు. రేవంత్‌‌‌‌రెడ్డి రెండేండ్ల పాలనలో చేసిందేమీ లేక.. గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వేయాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. 

ఆనాడు కాంగ్రెస్​ పార్టీని, వైఎస్​ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఘోరంగా తిట్టింది రేవంతే కదా అని అన్నారు.  ‘‘ఆనాడు టీడీపీలో ఉండి.. వైఎస్సార్ పావురాల గుట్టలో పావురం అయ్యాడు అని ఎలా అన్నావ్? కాంగ్రెస్ ప్రభుత్వ జలయజ్ఞాన్ని ధనయజ్ఞమని నువ్వే అన్నావు కదా? రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని పట్టుకొని క్విడ్ ప్రోకో కింద లక్ష కోట్ల అవినీతి చేశాడని చెప్పింది నువ్వే. కాంగ్రెస్ పాలనలో  తన తండ్రి చనిపోతే దహన సంస్కారాల అనంతరం స్నానానికి నీళ్లు లేని పరిస్థితి ఉండేదని చెప్పుకున్న మనిషి రేవంత్ రెడ్డి. ఆరోజు కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు అని క్షమాపణ చెప్పి.. నాటి కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలని అడగాలి​’’ అని  వ్యాఖ్యానించారు.

తిరోగమనంలో రాష్ట్ర వృద్ధి 

హైదరాబాద్‌‌‌‌పై కేసీఆర్​ వేసిన ముద్రను చెరిపేయడం రేవంత్​ జేజమ్మతరం కూడా కాదని హరీశ్‌‌‌‌రావు అన్నారు. రేవంత్​ వసూళ్లు, కమీషన్ల వల్ల జీఎస్టీ, స్టాంప్స్​అండ్​ రిజిస్ట్రేషన్​ ఆదాయం తగ్గిందన్నారు. రాష్ట్ర వృద్ధి తిరోగమనంలో ఉందని చెప్పారు.  హైదరాబాద్‌‌‌‌ను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసింది కేసీఆర్​, కేటీఆరేనని తెలిపారు. ఈ రోజు హైదరాబాద్‌‌‌‌లో వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ప్రణాళిక చేసి ఎస్టీపీలు నిర్మించింది  బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు.  ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక నాలాల్లో పూడిక తీయకపోవడం వల్ల బస్తీల్లోకి నీళ్లు వచ్చి ఇండ్లు మునిగాయని ఆరోపించారు. వరదలకు కారణం రేవంత్‌‌‌‌రెడ్డేనని అన్నారు.

 గాలి మాటలు తప్ప ఆరు గ్యారెంటీల గురించి సీఎం రేవంత్​ అస్సలు మాట్లాడడం లేదని మండిపడ్డారు.  ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్​ బకాయిలు అడిగినందుకు ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.8 వేల కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్​ బకాయిలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయన్నారు. పేద విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించలేని కాంగ్రెస్​ ప్రభుత్వం.. గత నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులను విడుదల చేసిందని, దానిపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వానికి పిల్లల చదువులు ముఖ్యమా? లేదంటే కాంట్రాక్టర్ల కమీషన్లా? అని ప్రశ్నించారు.   

బీజేపీకి, కాంగ్రెస్‌‌‌‌కు మధ్య ఉన్న ఒప్పందం ఏంటి?

బిహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ దాడులు జరిగాయని హరీశ్‌‌‌‌రావు అన్నారు. ‘‘గుర్గావ్‌‌‌‌లో భట్టి విక్రమార్క ఇల్లు, ఆయన అత్తగారిల్లు ఉంది. ఐటీ రైడ్స్​ జరిగిన విషయం ఎందుకు బయటకు రాలేదు. బీజేపీకి కాంగ్రెస్‌‌‌‌కి మధ్యలో ఉన్న ఒప్పందం ఏమిటి? మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే ఎందుకు చెప్పలేదు. ఈడీ ఎందుకు పొంగులేటిపై ప్రెస్ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇవ్వలేదు.

 బీజేపీతో అంటకాగింది రేవంత్‌‌‌‌రెడ్డి. ఆయనకు బీజేపీతో చీకటి ఒప్పందాలున్నయ్‌‌‌‌. ఢిల్లీలో బీజేపీతో రేవంత్‌‌‌‌రెడ్డి చీకటి రాజకీయాలు బయటపడ్డాయి. సెక్రటేరియెట్‌‌‌‌కు అంబేద్కర్ పేరు పెట్టడం రేవంత్‌‌‌‌రెడ్డికి ఇష్టం లేదు. ఆ పేరు ఉందని అక్కడికి పోవడం లేదు. ఆయనకు తెలంగాణ సోయిలేదు. తెలంగాణ ఉద్యమం గురించి తెల్వదు. సచివాలయం ఎందుకు నిర్మించామో అర్థం కాదు. ఈరోజు అది తెలంగాణ షాన్. అలాంటి సెక్రటేరియెట్‌‌‌‌లో ఇప్పడు 10%, 20% కమీషన్ల కోసం పైరవీకారులు, బ్రోకర్లు నిండిపోయారు. పీజేఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. పీజేఆర్‌‌‌‌‌‌‌‌ను మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. పీజేఆర్ కొడుకుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు?’’ అని ప్రశ్నించారు.