తెలంగాణకు కాంగ్రెస్​ చేసిందేమీ లేదు: హరీశ్​రావు

తెలంగాణకు కాంగ్రెస్​ చేసిందేమీ లేదు:  హరీశ్​రావు

తూప్రాన్ , మనోహరాబాద్ , వెలుగు: గత 60 ఏళ్లుగా తెలంగాణకు కాంగ్రెస్​ పార్టీ చేసిందేమీ లేదని మంత్రి హరీశ్​రావు అన్నారు. బుధవారం ఆయన తూప్రాన్, మనోహరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ గజ్వేల్ నుంచి పోటీ చేయడం గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. తూప్రాన్ లో 50 బెడ్స్​హాస్పిటల్​ను నిర్మాణం చేసుకొని 24 గంటల పాటు అద్భుతమైన సేవలు పొందుతున్నామన్నారు. 

తూప్రాన్ నుంచి గజ్వేల్ వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణాలు చేసి వాహదారులకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తూప్రాన్ వచ్చి అభివృద్ధిపై మాట్లాడడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో కొత్త బిచ్చగాళ్లు వచ్చినట్లు కాంగ్రెస్​ వాళ్లు ఓట్ల కోసం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.  అంతకు ముందు మనోహరాబాద్ లో కొత్తగా నర్మించిన పీహెచ్​సీ భవనాన్ని ప్రారంభించారు.  కొండా లక్ష్మణ్​ బాపూజీ బాపుజి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

  కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​ హేమలత, ఎఫ్డీసీ చైర్మెన్​ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్ రాజార్షిషా, తూప్రాన్ మున్సిపల్ చైర్మెన్ రవీందర్ గౌడ్, వైస్  చైర్మన్ నందాల శ్రీనివాస్, గడా ముత్యంరెడ్డి, ఆర్డివో జయచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మోహన్, డీఎస్పీ యాదగిరి రెడ్డి పాల్గొన్నారు.