గెల్లును గెలిపిస్తే.. జమ్మికుంటకు మెడికల్ కాలేజీ

గెల్లును గెలిపిస్తే.. జమ్మికుంటకు మెడికల్ కాలేజీ

జమ్మికుంట/హుజూరాబాద్ టౌన్, వెలుగు: టీఆర్ఎస్ మాట తప్పని పార్టీ అయితే బీజేపీ అబద్ధాల పార్టీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మికుంట మండలం మాచినపల్లి, వెంకటేశ్వర్లపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఆయన మాట్లాడారు. ‘‘జమ్మికుంట పట్టణానికి మెడికల్ కాలేజీ రావాల్నా..? రావాల్నంటే గెల్లు శ్రీను గెలవాలి. నిజాయతీ తప్పితే బర్ఖత్ ఉండదు. న్యాయం, ధర్మం తప్పవద్దు” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘వెన్ను పోటు పోడిచిన ఈటల రాజేందర్ కు ఓటు వేయాల్నా? పెట్రోల్, డిజీల్ ధరలు పెంచినందుకు ఓటు వేయాల్నా? కోట్ల ఉద్యోగాలిస్తామని, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టినందుకు బీజేపీకి ఓటు వేయాల్నా?” అని ప్రశ్నించారు. రెండో తేదీ తర్వాత సిలిండర్ ధర రూ. 1200కు పెంచుతారని, బీజేపీకి ఓటేస్తే ధరల పెంపును ఒప్పుకున్నట్లే అవుతుందన్నారు. కేసీఆర్ కిట్ లో రూ. 5 వేలు ఉంటయని ఈటల అబద్ధాలు చెప్తున్నడని, అందులో ఒక్క రూపయీ లేదన్నారు. ఒకప్పుడు యాసంగిలో పంటలకు నీళ్లే ఉండేవి కావని, ఇప్పుడు కాళేశ్వరంతో రైతుల కష్టాలు తీరాయని హరీశ్ రావు అన్నారు. ఈటల ఏడేండ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించలేదన్నారు. గెల్లును గెలిపిస్తే రుణ మాఫీ, పెన్షన్లు, డబుల్ ఇండ్ల వంటివన్నీ వస్తాయని, ఇవన్నీ దగ్గరుండి పూర్తి చేసే బాధ్యత తనదేనన్నారు. బీజేపీ నేతలు అగ్గిపెడతాం, కూలగొడతాం, గోరీ కడతాం అని తిడుతున్నారే తప్ప.. ప్రజల కోసం ఏం చేస్తామన్నది ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

రెడ్డి జేఏసీ నిరసన సెగ

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రెడ్డి జేఏసీ నాయకులు ఆదివారం పోతిరెడ్డిపేటలో మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అయితే శాంతియుతంగా నిరసనలు తెలిపిన తమపై టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందించి, చర్యలు తీసుకోకపోతే 30న జరిగే పోలింగ్ లో రెడ్లమంతా తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కాగా, వచ్చే బడ్జెట్ లో రెడ్డి కార్పొరేషన్ ను ప్రకటిస్తామని మంత్రి హరీశ్ రావు ఆత్మీయ సమ్మేళనంలో చెప్పినా, నిరసనలు తెలపడం ఏమిటని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. రెడ్డి ఆత్మీయుల మధ్య ఈటల చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.